బొత్స... ఉండాల్సినోడే!
posted on May 3, 2015 10:19AM

బొత్స సత్యనారాయణ ఒకప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా తనహవా నడిపించిన వ్యక్తి. ఉత్తరాంధ్ర రాజకీయాలన్నీ ఆరోజుల్లో ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఆయన మాట వేదంలా చెలామణీ అయ్యేది. అయితే చేసిన తప్పులు ఆయన పీకకు చుట్టుకున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన పొరపాట్లు ప్రజల శాపాల రూపంలో ఆయనకు తగిలాయి. చివరికి ఆయనతో సహా ఆయన ఫ్యామిలీ, సన్నిహితులు అందరూ ఎన్నికలలో తుక్కు తుక్కుగా ఓడిపోయారు.చీపురుపల్లి ప్రజలయితే ఆయన్ని చీపురుతో ఊడ్చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఇంత దారుణమైన స్థితికి పడిపోయిన్పటికీ, బొత్స సత్య నారాయణ తన ధోరణిని మార్చుకోలేదు. రాజకీయాల్లో తాను అనుసరిస్తున్న పాత తరహా ధోరణిలోనే వెళ్తున్నారు. ఈ మహానుభావుడు రాజకీయాల్లో ఉండాల్సినోడే అనిపించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోగానే బొత్స చూపు తెలుగుదేశం పార్టీ మీద పడింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన్ని పట్టించుకున్నవారు, పిలిచినవారు లేకపోవడంతో కొంతకాలం ఎదురుచూసిన ఆయన ఆ తర్వాత బీజేపీ తలుపులు తట్టారు. ఏపీలో కాస్తంత పేరున్న నాయకుడు ఎవరు తలుపు తట్టినా బార్లా తెరిచేయాలని అనుకున్న బీజేపీ తలుపులు తీయబోయింది. అయితే ఏపీలోని బీజేపీ నాయకుడు బొత్సను పార్టీలో చేర్చుకుంటే హైటెన్షన్ కరెంట్ తీగను పట్టుకున్నట్టేనని భయపెట్టడంతో బీజేపీ బొత్సకు తలుపులు తెరవకుండా గడియ మరింత గట్టిగా వేసేసింది. దాంతో బొత్స తాను అంతకుముందు వరకూ నోటికొచ్చినట్టు తిట్టిపోసిన జగన్ పార్టీలోకి జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ నాయకుడు జగన్ బొత్స పార్టీ ప్రవేశానికి అనుకూలంగా వున్నారన్న వార్తలు రాగానే ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాల్లో కలవరం, కలకలం రేగి ఎమ్మెల్యేల రాజీనామా వరకు పరిస్థితి వెళ్ళింది. ప్రస్తుతం జగన్ తన పార్టీ నాయకులకు సర్దిచెప్పి, బొత్సని ఆహ్వానించాలనే ఆలోచనలో వున్నారు.
రేపో మాపో బొత్స వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ స్టేజ్‌లో బొత్స బుద్ధిగా ఇంటిపట్టున కూర్చోకుండా, కాంగ్రెస్ పార్టీ గుంటూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి కేంద్రం అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులంతా కలసి చేసిన దీక్ష అది. ఆ దీక్షలో పాల్గొన్న బొత్స ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ విమర్శలన్నీ చంద్రబాబు నాయుడిని నేను ఇంత ఘాటుగా విమర్శించగలను అని జగన్‌కి తెలియచెప్పడం కోసమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన విమర్శల ఘాటును విని జగన్ తనను అర్జెంటుగా పార్టీలోకి తీసుకుంటాడనేదే బొత్స ప్రణాళిక అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో చేరడం కోసం కాంగ్రెస్ పార్టీ వేదికను విజయవంతంగా వినియోగించుకున్న బొత్స తెలివితేటలే తెలివితేటలని పరిశీలకులు అంటున్నారు.