వైకాపా నేతల ఆ ధోరణి ఏమిటో?
Publish Date:Jul 15, 2015
Advertisement
పచ్చ కామెర్ల వ్యాధి ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లే వైకాపా నేతలకి తమ ఆలోచనా విధానానికి, స్థాయికి తగ్గట్టుగానే మాట్లాడటం, ప్రతీ అంశాన్ని చూడటం, దానిని తమ కోణంలో నుండే ప్రజలకి కూడా చూపించాలని విఫలయత్నాలు చేయడం అలవాటుగా మారిందని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజమండ్రిలో నిన్న జరిగిన దుర్ఘటనపై వైకాపా నేతలు చేస్తున్న శవరాజకీయాలు చూసి రాజకీయ నేతలందరూ సిగ్గుతో తలలు దించుకోవలసి వస్తోందని తెదేపా నేతలు అంటున్నారు. సామాన్య భక్తులకోసం కేటాయించిన కోటగుమ్మం పుష్కర ఘాట్ లో చంద్రబాబు నాయుడు స్నానం చేయడం వలననే బయట రద్దీ పెరిగిపోయి త్రొక్కిసలాట జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే, ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మరొక్క మెట్టు క్రిందకు దిగి, పుష్కరాలకు లక్షలాది జనం తరలివచ్చారని చూపించి, చంద్రబాబు నాయుడుకి మరింత ప్రచారం కల్పించేందుకే పోలీసులు రాజమండ్రికి చేరుకొంటున్న ప్రజలను బలవంతంగా కోటగుమ్మం పుష్కర్ ఘాట్ వైపు పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం దానిని లఘుచిత్రం (షార్ట్ ఫిలిం)గా చిత్రీకరించిందని, ఆ కారణంగానే 35మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఆమె ఆరోపణలకు తెదేపా నేతలు కూడా అంతే ధీటుగా స్పందించారు. “ఇంత నీచమయిన ఆలోచన కేవలం వైకాపా మాత్రమే చేయగలదని” విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్రీష్టియన్ మతస్తుడు అయినప్పటికీ పుష్కరాలలో స్నానాలు చేయడం, తండ్రికి పిండ ప్రదానాలు చేయడం వంటివన్నీ ప్రజలను ఆకట్టుకోవడానికేనని వారు ఆరోపిస్తున్నారు. అత్యంత రద్దీ సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి ఇటువంటి డ్రామాలు ఆడుతూ, ఇటువంటి శవ రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పుష్కర స్నానం వలన కలిగిన పుణ్యం కూడా లేకుండా చేసుకొంటున్నారని తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. ఇటువంటి సమయంలో పుష్కరాలకు వస్తున్న ప్రజలకు అండగా నిలబడి, వారి యాత్రలు సజావుగా పూర్తి చేసుకొనేందుకు సహకరించవలసింది పోయి, ప్రభుత్వాన్ని మరింత అప్రదిష్ట పాలు చేసేందుకే ప్రజలలో మరింత భయాందోళనలను పెంచే విధంగా వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఏమయినప్పటికీ ఇకపై ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పుష్కరాలను ప్రశాంతంగా, దిగ్విజయంగా నిర్వహిస్తామని తెదేపా నేతలు శపథం చేస్తున్నారు. వారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ ఇంతవరకు కేవలం తెలంగాణాలో జరిగే పుష్కరాల గురించి, వాటి కోసం తెరాస ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అది ఎంతగా అంటే అసలు ఆంధ్రాలో పుష్కరాలే జరగడం లేదన్నట్లు, కేవలం తెలంగాణాలో మాత్రమే గోదావరి పుష్కరాలు జరుగుతున్నంతగా! అది చూసి రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. జగన్ కి చెందిన మీడియాలో రాజమండ్రిలో జరుగబోతున్న గోదావరి పుష్కరాల గురించి, వాటి కోసం గత నెలరోజులుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని గురించి ఏనాడు పెద్దగా ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగిన మరుక్షణం నుండి పదేపదే దాని గురించి కధనాలు ప్రసారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులని చేసే ప్రయత్నాలు చేయడం చాలా శోచనీయం. ఈ విధంగా ప్రతీ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించి వైకాపా ఇదివరకు చాలా సార్లు భంగపడింది. బహుశః మళ్ళీ ఈ వ్యవహారంలో కూడా దానికి మరొక్కమారు భంగపాటు తప్పదేమో?
http://www.teluguone.com/news/content/ysr-congress-party-45-48355.html





