పుష్కర ఘటనలు పునరావృతం జాగ్రత్త పడవచ్చు
Publish Date:Jul 14, 2015
Advertisement
ఈ మహా పుష్కరాల గురించి ప్రభుత్వాలు, మీడియా చేసిన అతి ప్రచారం వలననే ఊహించిన దాని కంటే చాలా భార్గీ ప్రజలు తరలివస్తున్నారని చెప్పవచ్చును. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఊహించని స్థాయిలో లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలను నియంత్రించడం అధికారుల వలన కాలేదు. అందుకే ఈరోజు ఈ దుర్ఘటన జరిగిందని చెప్పవచ్చును. నిజానికి ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 27 ఘాట్స్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలను వాటి వైపు మళ్ళించకుండా రాజమండ్రిలోకి అనుమతించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్పవచ్చును. పుష్కరాలలో మొదటి రోజయిన మంగళవారంనాడు రాజమండ్రిలో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపిస్తే, అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద చాలా పలచగా జనం కనిపించారు. నది తీరం అంతా ఖాళీగా కనబడింది. రెండు జిల్లాలలో ఖాళీగా ఉన్న అటువంటి ఘాట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అధికారులు ముందు నుండే ప్రజలను వాటి వైపు మరలించే విధంగా ప్రణాళికలు, ఏర్పాట్లు చేసుకొని ఉండి ఉంటే ఈ దుర్ఘటన జరిగేదే కాదేమో? కనుక ఇకనయినా ప్రభుత్వం ఏఏ ఘాట్స్ వద్ద ఖాళీ ఉంది? ఇంచుమించుగా అక్కడ ఎంతమంది స్నానాలు చేస్తున్నారు? అక్కడికి చేరుకోవడానికి దగ్గర మార్గం ఏది? అక్కడికి చేరుకోవడానికి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది? వంటి వివరాలను రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో డిజిటల్ టీవీల ద్వారా, టీవీ చాన్నాళ్ళలో ఇంటర్నెట్ లో విరివిగా ప్రచారం చేసినట్లయితే ఈ రద్దీని నియత్రించవచ్చును. ఈ పుష్కరాలను నిర్వహిస్తున్న స్థానిక అధికారులే స్వయంగా ప్రజలను వేర్వేరు ఘాట్స్ వైపు మళ్ళించడం మంచిది. ప్రజలు కూడా రాజమండ్రిలోనే పుష్కర స్నానాలు చేయాలనుకోకుండా మిగిలిన 12 రోజుల్లో ఖాళీగా ఉన్న వేర్వేరు ఘాట్స్ స్నానాలు చేయడం మంచిది. పుష్కర ఘాట్స్ లో ఖాళీ ఉందని రూడీ చేసుకొంటే తప్ప చిన్న పిల్లలను, వృద్ధులను తీసుకు వెళ్ళకపోవడమే మంచిది. పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళ కోసం పోస్టల్ శాఖ గోదావరి పుష్కర జలాలను ప్యాకెట్ల ద్వారా ఇంటికే అందిస్తోంది. పుష్కర మంత్రం చదువుకొని ఆ నీళ్ళను నెత్తిన జల్లుకొన్నా చాలని వేదపండితులు చెపుతున్నారు. కాశీ వెళ్లి గంగలో మునగలేక పోయినవారు అక్కడికి వెళ్లి వచ్చే తమ బంధు, మిత్రుల ద్వారా కాశీ నుండి గంగను తెప్పించుకొని, ఇంట్లో ఉంచుకొని అవసరమయినప్పుడు అదేవిధంగా చేయడం హిందువులు అందరికీ తెలిసిన విషయమే. కనుక గోదావరి పుష్కరాలకు వెళ్ళలేని వారు కూడా ఈ పద్ధతినే ఆశ్రయించడం మంచిది.
http://www.teluguone.com/news/content/godavari-pushkaraalu-45-48335.html





