రాహుల్ గాంధీ పర్యటనకి తెదేపా ప్రచారం?
Publish Date:Jul 15, 2015
Advertisement
ఇంతకు ముందు తెలంగాణాలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈనెల 24న ఆంధ్రాలో (అనంతపురం జిల్లాలో) పాదయాత్ర చేయడానికి వస్తున్నారు. కానీ ఆయనని ఆంధ్రాలో అడుగుపెట్టనీయమని జిల్లాకు చెందిన కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినందుకు ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే రాష్ట్రంలో అడుగుపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, వి.హనుమంతరావు వంటి వీరవిధేయులు గట్టిగా జవాబిస్తున్నారు. ఈవాదోపవాదాల వలన రాహుల్ గాంధీకి, ఆయన పాదయత్రకి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందనే సంగతి తెదేపా నేతలు విస్మరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయం బాగానే గ్రహించినట్లున్నారు. అందుకే వారు మరింత ధీటుగా తెదేపా నేతలకు బదులిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్, తెదేపా నేతల మధ్య ఎంత వాగ్వాదాలు జరిగితే అంత ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుందని కాంగ్రెస్ నేతలకి అర్ధమయింది. కానీ తెదేపా నేతలకి ఇంకా అర్దమయినట్లు లేదు. ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చక్కగా వ్యవహరించారని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గాంధీలు వస్తుంటారు వెళుతుంటారు. వారిని పట్టించుకోనవసరం లేదు,” అని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ జిల్లా పర్యటనకి తను ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టం చేసారు. అంతే కాదు తెరాస నేతలెవరూ కూడా ఆయన పర్యటన గురించి అసలు పట్టించుకోకుండా చేసారు. దానితో కేసీఆర్ చెప్పినట్లే ‘రాహుల్ గాంధీ వచ్చేరు..వెళ్ళేరు అంతే!” అన్నట్లు చాలా చప్పగా పూర్తయింది ఆయన పాదయాత్ర. కానీ ఆంధ్రాలో తెదేపా నేతలు రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఆయన పర్యటనకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్వయంగా ప్రకటించుకోవడమే కాకుండా ఆయన పర్యటనకి వారే ఉచిత ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఆయన పర్యటనపై పడేలా చేస్తున్నారు. కానీ తెదేపా నేతలు కూడా ఆయన పాదయత్రని పట్టించుకోకుండా ఊరుకొంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా రాహుల్ గాంధీ మారధన్ రేసులో పాల్గొంటున్నట్లు హడావుడిగా జిల్లాలో పాదయాత్ర చేసినంత మాత్రాన్న జీవచ్చవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ బ్రతికి బట్ట కడుతుందని ఎవరూ కూడా అత్యాశకి పోవడం లేదు.
http://www.teluguone.com/news/content/rahul-gandhi-45-48364.html





