బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్
Publish Date:Dec 26, 2020
Advertisement
తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు, ఏపీకి చెందిన శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి ఓ టీమ్ తయారుచేసి, వైసీపీకి చెందిన రజాక్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. రజాక్ ను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే చక్రపాణి అక్రమాలకు పాల్పడుతున్నారని, అడ్డగోలుగా కాంట్రాక్టులు పొందుతున్నారని విమర్శలు చేశారు. శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడాలని, ఎమ్మెల్యే చక్రపాణిని కట్టడి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని, తాము ఇన్వాల్వ్ అయితే వేరేలా ఉంటుందని రాజాసింగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. రాజా సింగ్ వ్యాఖ్యలపై చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజాసింగ్ ఎప్పుడంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన ఆయన.. ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? అని రాజా సింగ్ కు సవాల్ విసిరారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని, అక్కడ వాళ్ళు 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. రజాక్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రమే రాజకీయాల్లో ఉన్న తనకు ఆయన బినామీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఎన్నో దేవాలయాలకు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి తనను పట్టుకొని హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/ycp-mla-chakrapani-reddy-challenge-to-bjp-mla-raja-singh-39-108159.html





