నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారు! రాహుల్ కు ప్రధాని మోడీ చురకలు
Publish Date:Dec 26, 2020
Advertisement
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేశారు. దేశ అభివృద్ధితో భుజం భుజం కలుపుతూ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ కూడా అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గాంధీ మహాత్ముడి విజన్ అయిన గ్రామ స్వరాజ్యాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు సాధించారని ప్రశంసించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు ఓట్లు వేశారని, అధిక సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారని ప్రధాని కొనియాడారు. గతంలో తాము ఇక్కడి ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్నామని, ఆ తర్వాత పొత్తు విచ్ఛిన్నమైపోయిందని మోడీ పరోక్షంగా మెహబూబాతో కొనసాగిన పొత్తు గురించి వ్యాఖ్యానించారు. ప్రజలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని, తమకు నచ్చిన వారిని ఎన్నుకోవాలన్నదే తమ తాపత్రయంగా ఉండేదని వివరణ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరూ లాభపడతారని చెప్పారు ప్రధాని మోడీ.
ప్రతిరోజూ తనను విమర్శిస్తున్న వారంతా జమ్మూకశ్మీర్‌ను చూసి నేర్చుకోవాలని ప్రధాని హితవుపలికారు. జమ్మూ కశ్మీర్ లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ.. కాంగ్రెస్ సహా విపక్షాలపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూపించాయన్నారు. ఢిల్లీ వేదికగా రోజూ నన్ను అవమానించాలని, నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారు.. వారి కపటత్వం, పవిత్రతను ఓ సారి చూడండి అని మోడీ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా... కాంగ్రెస్ పార్టీ పాండిచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదని... కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను ప్రకటించగానే తాము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/pm-modi-attack-rahul-gandhi-39-108162.html





