రేవంత్ టార్గెట్ గా సోనియాకు లేఖ! వీహెచ్ బాటలోనే జగ్గారెడ్డి!
Publish Date:Dec 26, 2020
Advertisement
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక పీటముడి ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. పీసీసీ చీఫ్ ను హైకమాండ్ దాదాపుగా ఖరారు చేసిందని ఓ వైపు ప్రచారం జరుగుతుండానే.. మరోవైపు కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ గా ఖాయమయ్యారనే ప్రచారం జరుగుతున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా దూకుడు పెంచారు ఆయన ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జ్ ఠాగూర్‌కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని లేఖలో ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని జగ్గారెడ్డి కోరారు. పీసీసీ ఎన్నికపై సీనియర్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్ ఎన్నిక జరగాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి... సోనియారు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
పీసీసీ విషయంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కీలక పోస్టులు ఇవ్వొద్దంటూ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చాలా సార్లు చెప్పారు. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇటీవల గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో బయటకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందని అంతా భావించారు. కాని జగ్గారెడ్డి తాజా ప్రకటనతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరో సీనియర్ హనుమంతరావు కూడా రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యయతిరేకిస్తున్నారు. శుక్రవారం మరో కీలక ప్రకటన చేశార. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తానని ప్రకటించి సంచలనం రేపారు. వీహెచ్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అభిమానులు తీవ్రంగా స్పందించడం... తనను ఫోన్ చేసి తిట్టారంటూ రేవంత్ రెడ్డి అనుచరుడిపై హనుమంతరావు కేసు పెట్టడం కూడా జరిగిపోయాయి. వీహెచ్ కామెంట్లపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. వీహెచ్ కు ఏఐసీసీ నుంచి షోకాజ్ నోటీసులు రావొచ్చని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/mla-jagga-reddy-letter-to-sonia-target-revanth-reddy-39-108157.html





