కేసీఆర్ నేల విడిచి సాము.. బాబు బూచి అంటే జనం నమ్ముతారా?
Publish Date:Dec 21, 2025
Advertisement
బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి నేల విడిచి సాము చేశారు. కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమికి కారణాలు, ఇటీవలి కాలంలో పార్టీలో సంక్షోభ పరిస్థితులపై మాటమాత్రమేనా ప్రస్తావించకుండా.. ఏకకాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుని, పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు శనిలా దాపురించిందని శాపనార్ధాలు పెట్టారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ దద్దమలా చూస్తూ కూర్చుందంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబునా యుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ అన్యాయంపై ఆయన మాట్లాడినా, ఆయన అసలు లక్ష్యం మాత్రం చంద్రబాబును రెచ్చగొట్టి చంద్రబాబు లేదా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి విమర్శలు రావాలనీ, అలా వస్తే మొత్తం పరిస్థితిని తెలంగాణ వర్సెస్ ఏపీగా మార్చి ఏకకాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనీ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి, రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో బలోపేతం కావాలన్న ఉద్దేశం వినా కేసీఆర్ మాటలలో రాష్ట్రానికి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే.. తన కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్టును దండగమారి ప్రాజెక్టు అనడంపై స్పందించి కనీసం ఆమె వ్యాఖ్యలను ఖండించి ఉండేవారని చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఇంత కాలం సమయం ఇచ్చామనీ, ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించినా, ఆయన మాటలు విన్న ఎవరికైనా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు జపంగా మారిపోయింది. కనీసం ఓ 50 సార్లు ఆయన చంద్రబాబు పేరు ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు కాదు చంద్రబాబే కారణమని తేల్చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు చంద్రబాబు గురువు అన్నారు. బాబును కాదనీ రేవంత్ ఏం చేయరన్నారు. అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలకంగా ఉన్న చంద్రబాబు అభీష్ఠం మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలన్నా, కనీసం ఉనికిని చాటుకోవాలన్నా చంద్రబాబు ను లాగకుండా సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ రగిల్చిన సెంటి ‘మంటే’ కారణమనడంలో సందేహం లేదు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో స్వయంగా తానే సెంటిమెంట్ ను నీరుగార్చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారు. అందుకే నీట తగాదాలు, సాగర్ వివాదం అంటూ 2023 ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా జనం తిరస్కరించారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం సెంటిమెంట్ పని చేయదన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా తెలంగాణం 2023 ఎన్నికలలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు అంటూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని బూచిగా చూపాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం నేల విడిచి సామేనని అంటున్నారు పరిశీలకులు.
http://www.teluguone.com/news/content/kcr-flattery-of-babu-39-211374.html




