యుద్ధం.. అమెరికా సైనికుల్లో భయం
Publish Date:Apr 3, 2026
Advertisement
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అగ్రరాజ్యం అమెరికా సైనికుల్లో ఆందోళన నింపుతోంది. ఇరాన్‌తో ముంచుకొస్తున్న పోరు నేపథ్యంలో అక్కడ మోహరించిన అమెరికా బలగాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురౌతున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా సైనికులు తమ భయాలను అధిగమించేందుకు క్లబ్బులను ఆశ్రయిస్తున్నట్లు సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ వెల్లడించారు. సైనిక స్థావరాలకు సమీపంలో ఉన్న వినోద కేంద్రాలకు సైనికులు పోటెత్తుతున్నారని, అక్కడ వారు భారీగా డబ్బు ఖర్చు చేస్తూ సేదతీరుతున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. ముఖ్యంగా తక్కువ వయసున్న సైనికులు కూడా ఈ యుద్ధ భయంతో కలత చెందుతున్నారనీ, మేము యుద్ధానికి వెళ్తున్నాం" అంటూ వారు తనతో పంచుకున్న మాటలను ఇన్‌ఫ్లుయెన్సర్ వివరించారు. వారి ముఖాల్లో కనిపిస్తున్న ఒత్తిడిని చూస్తుంటే బాధగా అనిపించింద వ్యాఖ్యానించాడు. పశ్చిమాసియాలో రక్షణ ఏర్పాట్లను అమెరికా పెంచుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే వేల సంఖ్యలో బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన పెంటాగన్, సైనికులలో మానసిక ఒత్తిడిని ఇసుమంతైనా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తరువాత అగ్రరాజ్యంతో ట్రంప్ తీరుపట్ల ఆగ్రహం మరింత ఎక్కువ వ్యక్తం అవుతోంది. యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సైనికుల కదలికలు, వారి మానసిక స్థితిపై ఇలా బహిరంగంగా వీడియోలు రావడం పట్ల అమెరికా మాజీ సైనికాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బులు, పబ్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో సైనికులు చేసే సాధారణ సంభాషణలు శత్రువులకు కీలక సమాచారాన్ని అందించే ప్రమాదం ఉందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతున్నది. సైనిక గోప్యత దెబ్బతినడం పెను ముప్పుకు దారితీసు ప్రమాదం ఉందని అమెరికా రక్షణ అధికారులు సైతం అంటున్నారు. ఈ తరుణంలో సైనికుల మానసిక ఆరోగ్యం మరియు భద్రతపై అగ్రరాజ్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. కాగా ఆ ఇన్ ఫ్లుయెన్సర్ వీడియో ద్వారా ట్రంప్ ప్రపంచంపైనే కాదు, అమెరికాపైనా, అమెరికా సైన్యంపైనా కూడా యుద్ధాన్ని బలవంతంగా రుద్దుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
http://www.teluguone.com/news/content/war-fear-in-america-soldiers-36-216619.html





