పొక్సో కేసులో బండి భగీరధ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ
Publish Date:May 26, 2026
Advertisement
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచలగూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు, నిందితుడిని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ఈ మేరకు మేడ్చల్–మల్కాజిగిరి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో భగీరథును కస్టడీలోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసుల ప్రకారం కాల్ డేటా రికార్డులు, సాంకేతిక ఆధారాలు, అలాగే సంబంధిత వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో, నిందితుడి కస్టడీ విచారణపై అందరి దృష్టి నెలకొంది.
http://www.teluguone.com/news/content/bandi-bhagirath-remanded-in-police-custody-for-3-days-in-pocso-case-36-220958.html





