ఆశా భోంస్లే మృతి పట్ల సినీ తారల సంతాపం
Publish Date:Apr 12, 2026
Advertisement
మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ నివాళి అర్పించారు. “ఆశా భోస్లే గారి గొంతు భారతీయ సినిమాకు తరతరాలుగా నిలిచిపోయే అపూర్వమైన సంపద. ఎన్నో భావోద్వేగాలను పలికించిన ఆమె గాత్రం ప్రతి పాటలోనూ అప్రయత్నమైన శైలి, వైవిధ్యంతో ఆకట్టుకుంది. భారతీయ సినిమా భర్తీ చేయలేని గొంతుకను కోల్పోయింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని పేర్కొన్నారు. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ కూడా ‘ఎక్స్’లో వీడియో క్లిప్ షేర్ చేస్తూ హిందీలో నివాళులు అర్పించారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ, “ఆశాజీని కోల్పోవడం నాకు వ్యక్తిగత నష్టంలా అనిపిస్తోంది. ఆమె గాత్రం నా చిత్రాలను అలంకరించింది” అని రాశారు. కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి స్పందిస్తూ, “హద్దులు దాటిన గొంతుక ఆమెది. ఆమె లేని లోటు భారతీయ సినిమా, సంగీత ప్రపంచానికి తీరనిది” అని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, “ఆశా భోస్లే గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆమె మాయా గాత్రం గుండెచప్పుడులా నిలిచింది. ఆమె వారసత్వం తరతరాలకు నిలిచిపోతుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని పేర్కొన్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు, “ఆశా భోస్లే గారితో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె గాత్రం కేవలం సంగీతం కాదు, మన జీవితంలోని ప్రతి దశలో మనతో ఉన్న భావోద్వేగం. తరతరాల హృదయాలను ఆమె లాగా స్పృశించిన కళాకారులు అరుదు” అని తెలిపారు. విష్ణు మంచు కూడా, “మనం ఆమె పాటలను కేవలం వినలేదు… వాటితో జీవించాం. ఇది పూడ్చలేని లోటు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు, ఆశా భోస్లేతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “ఆశా గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆమె మా కుటుంబ సభ్యురాలే. చెన్నైకి వచ్చినప్పుడల్లా మా తాత శివాజీ గణేశన్ ఇంట్లోనే ఉండేవారు” అని తెలిపారు. ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ఆమెకు నివాళులు అర్పించారు. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆశా భోస్లే మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. “ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీతో పాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మహాగాయని ఆమె. పాశ్చాత్య సంగీత శైలిని కూడా అలవోకగా ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారు. ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై తుమ్నే’, ‘ఇన్ ఆంఖో కి మస్తీ’, ‘రాధా కైసే న జలే’ వంటి గీతాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని తెలిపారు.
http://www.teluguone.com/news/content/asha-bhosle-36-217204.html





