అందుకేనా తెరాస మళ్ళీ కేంద్రంతో కటీఫ్?
Publish Date:Jul 17, 2015
Advertisement
ఆ మధ్యన కేసీఆర్ కుమార్తె (నిజామాబాద్ యంపీ) కవిత ప్రధాని మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొని తమ పార్టీ మోడీ ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెలుగుతోందనే సంకేతాలు పంపారు. అంతకు ముందు “మోడీలేదు...గీడీలేదు...” అని అన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హటాత్తుగా తన వైఖరిని మార్చుకొని ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని హడావుడిగా మొదలుపెట్టేసారు. తన కుమార్తె కవితకు కేంద్రమంత్రిగా చేసేందుకే ఆయన తన వైఖరి మార్చుకొన్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. వారి ఆరోపణలు కేవలం ఊహాగానాలని మొదట కొట్టిపారేసిన కవిత, మళ్ళీ కొన్ని రోజుల తరువాత “మోడీ ఆహ్వానిస్తే కేంద్రంలో మంత్రిగా చేరేందుకు తాను సిద్దమే”నని ప్రకటించడంతో వారి ఆరోపణలు, అనుమానాలు నిజమేనని ద్రువీకరించినట్లయింది. మోడీ ప్రభుత్వం నేటికీ నిలకడగానే వ్యవహరిస్తోంది కానీ తెరాస నేతల వైఖరి మాత్రం మళ్ళీ అకస్మాత్తుగా మారిపోయింది. బహుశః కవితకు కేంద్రమంత్రి మంత్రి ఇవ్వకపోవడం వలననే వారు తమ వైఖరి మార్చుకొన్నారేమో తెలియదు కానీ, ఇంతకు ముందు మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొన్న కవిత కూడా ఇప్పుడు ఆయనపై నిప్పులు కక్కుతున్నారు. మోడీ ప్రభుత్వం మొదటి నుండి కూడా తెలంగాణా పట్ల వ్యతిరేకత, సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని కానీ ఆంధ్రా పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ఏడాది గడిచినా ఇంకా హైకోర్టు విభజించకపోవడం, పుష్కరాలలో తెలంగాణా కంటే ఆంధ్రాకు ఎక్కువగా నిధులు కేటాయించడం, తమ అనుమతి తీసుకోకుండా బేగంపేట విమానాశ్రయాన్ని ఆర్మీకి అప్పజెప్పాలని నిర్ణయించుకోవడం వంటి అనేక కారణాలు ఆమె చూపుతున్నారు. ఆమె కేంద్రంపై నేరుగా విరుచుకుపడటంచూస్తే, బహుశః అందుకే మొన్న డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దుమ్మ కొట్టి ఉంటారని అనుమానించవలసి వస్తుంది. కానీ హైకోర్టు విభజనలో ఉన్న న్యాయపరమయిన అంశాల గురించి తెలిసి కూడా ఆమె కేంద్రాన్ని తప్పుపట్టడం అనుచితమేనని చెప్పకతప్పదు. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నిర్మించుకొనే వరకు హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతున్న రాజధాని అమరావతి నగరంలో హైకోర్టుని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది. రాజధాని నిర్మాణం మొదలయ్యి అందులో హైకోర్టుకి శాశ్విత భవనాలు, ఇతర సౌకర్యాలు అన్నీ కల్పించే వరకు ఉమ్మడికోర్టు కొనసాగక తప్పదని స్వయంగా హైకోర్టు ధర్మాసనమే స్పష్టం చేసింది. అంతవరకు ఎవరూ ఆందోళనలు చేయడానికి వీలులేదని, చేస్తే చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక అవరోధం గమనించిన తరువాతనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయలేకపోయింది. లేకుంటే మూడు నెలల్లోనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేస్తామని న్యాయశాఖామంత్రి సదానంద గౌడ ఇదివరకే ప్రకటించారు. ఇవన్నీ తెరాస ఎంపీ కవితకు తెలియవని భావించలేము. కానీ తెలియనట్లు ఆమె మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అంటే ఆమె అక్కసుకి వేరే ఇతర కారణాలున్నాయని అనుమానించవలసి వస్తుంది. ఆమెకు కేంద్రమంత్రి ఇవ్వకపోవడం, ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్: 8 అమలు తదితర అంశాలలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం చెంది ఉండటం అందుకు ప్రధాన కారణాలు కావచ్చును. కానీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కూడా కాని తెరాస, కేంద్రమంత్రి పదవిని ఏవిధంగా ఆశిస్తోందో తెలియదు. ఒకవేళ ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలనుకొంటే అందులో మొట్టమొదట తన పార్టీకి చెందిన నేతలకు, ఆ తరువాత ఎన్డీయే కూటమిలో భాగస్వామి పక్షాలకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చుకొంటారే కానీ తెరాసని, కేసేఆర్ ని మంచి చేసుకోవడానికి కవితకు కేంద్రమంత్రి పదవి కట్టబెడతారని అనుకోవడం అత్యాశే. అయినా మోడీతో సెల్ఫీలు తీసుకొన్నంత మాత్రాన్న కేంద్రమంత్రి పదవి ఆశించేయడమేనా? కొన్ని రోజులు కేంద్రంతో సన్నిహితంగా మెలగడం, మళ్ళీ మరికొన్నాళ్ళు కత్తులు దూస్తూ తెరాస ప్రభుత్వం నిలకడలేని వ్యవహారశైలి ప్రదర్శిస్తోంది. దాని వలన తెలంగాణా రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కేంద్రంపై ప్రస్తుతం కవిత చేస్తున్న ఆరోపణలు చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.
http://www.teluguone.com/news/content/trs-45-48410.html





