పాపం... లగడపాటి
Publish Date:Jul 22, 2015
Advertisement
పాపం లగడపాటి రాజగోపాల్. ఎలా వుండేవాడు ఎలా అయిపోయాడో. ఒకప్పుడు సీమాంధ్ర సింహంగా గర్జించిన లగడపాటి ఇప్పుడు తెలంగాణలో పుణ్యస్నానం చేసి మ్యావ్ అని మూలుగుతున్నారు. లగడపాటిని ఈ స్థితిలో చూసిన వారు ఎవరికైనా ఆయన మీద బోలెడంత జాలి కలగడం ఖాయం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా సమైక్యవాది హోదాలో లగడపాటి చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకునే వారు కొంతమంది బాధపడటం కూడా ఖాయం. ఆ రోజుల్లో సీమాంధ్రులందరికీ ఒక రోల్ మోడల్‌గా నిలిచిన ఆయన్ని కాలం ఎంతలో ఎంతలా మార్చేసిందో చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.
తెలంగాణ వచ్చే వరకూ తెలంగాణ వాదులకు, టీఆర్ఎస్ నాయకులకు లగడపాటి పెద్ద శత్రువు. లగడపాటి పెద్ద దోపిడీదారుడు. తెలంగాణ వచ్చిన తర్వాత లగడపాటి తాను ప్రకటించిన విధంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయితే పరోక్షంగా ఆయన తెలంగాణ పాలకులకు దగ్గరయ్యారు. తెలంగాణ పాలకులతో కరెంటు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొంతమంది తెలంగాణ కీలక నాయకులతో వ్యాపార సంబంధాలు కూడా ఈమధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందాయట. తెలంగాణ రాకముందు లగడపాటి వ్యాపారాలు వర్ధిల్లాయి... తెలంగాణ ప్రజలకు శత్రువుగా ప్రొజెక్టు అయిన లగడపాటి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా లాభం పొందుతున్నారు.
ఇప్పుడు లగడపాటిని తెలంగాణ నాయకులెవరూ తిట్టిపోయడం లేదు. లగడపాటి కూడా తెలంగాణ నాయకులు తిట్టే విధంగా కాకుండా లోపాయికారీగా వాళ్లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే లోపల లోపల ఎంత స్నేహం వున్నా పర్లేదు. ఎన్ని వ్యాపార బంధాలున్నా ఓకే. కానీ లగడపాటి లాంటి వ్యక్తి మీడియా మైకుల ముందు నిల్చుని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబు ఇవ్వడమే ఆయన మీద జాలి కలిగించే విషయం. మొన్న కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి కుటుంబ సమేతంగా పుష్కర స్నానానికి వెళ్ళిన లగడపాటి పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా వున్నాయని, కొత్త రాష్ట్రమైనా పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా చేశారని అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఈ సందర్భంగా చాలామంది లగడపాటిని చూసి జాలిపడుతున్నారు. ఎంత వీర సమైక్యవాది అయినా వ్యాపారం కోసం ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి ఆయనది అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/lagadapati-45-48514.html





