తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ
Publish Date:Jul 16, 2015
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి తను తానే నిందించుకోవలసి ఉంటుంది. కారణాలు అందరికీ తెలిసినవే. ఏడాదిగా రెండు రాష్ట్రాలలో తమ పార్టీని దానితో ముడిపడున్న తమ నేతల రాజకీయ భవిష్యత్ ని కూడా వారి అధిష్టాన దేవతలు పట్టించుకోలేదు. అందుకే రెండు రాష్ట్రాలలో చాలా మంది సీనియర్ నేతలు పార్టీని విడిచి పెట్టి వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుగా ఇప్పుడు రాహుల్ గాంధీ మేల్కొని రెండు రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షులని, సీనియర్ నేతలని డిల్లీకి పిలిపించుకొని పార్టీ పరిస్థితిని సమీక్షించారు. రెండు రాష్ట్రాలలో పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని, సభ్యత్వనమోదు ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాల నేతలని ఆయన ఆదేశించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో పార్టీ నేతలు చురుకుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రగిలించిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆ అంశాలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలనుకొంటున్నట్లు తన నేతలకు తెలిపారు. ఆ తరువాత పార్టీలో సీనియర్ నేతలయిన బొత్స, డి.యస్ తదితరుల నిష్క్రమణ గురించి చర్చిస్తున్నప్పుడు జానారెడ్డిని ఉద్దేశ్యించి “మీరు పార్టీలో ఉంటున్నారా లేక త్వరలోనే వెళ్ళిపోతున్నారా?” అని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంటే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో తెలుసుకోలేని పరిస్థితిలో రాహుల్ ఉన్నట్లు అర్ధమవుతోంది. కానీ ఇప్పటికయినా ఆయన చొరవ తీసుకొని పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం పార్టీ నేతలకి కూడా సంతృప్తి కలిగించింది. తెలంగాణా ఇచ్చినందున కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో ప్రజలు ఆదరించవచ్చును. కానీ అక్కడా ఆ పార్టీ గెలవలేకపోగా కనీసం అధికార తెరాస ధాటికి నిలబడి గట్టిగా పోరాటం చేసే పరిస్థితిలో లేదు. పార్టీ నేతలని తెరాసలోకి ఆకర్షిస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ “వాళ్ళు పోయినంత మాత్రాన్న పార్టీకి ఏమీ నష్టం లేదు” అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవలసి వస్తోంది. ఎంతో కొంత అనుకూలతలున్న తెలంగాణాలోనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలద్రొక్కుకోలేనప్పుడు ఇక నేటికీ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆంధ్రాలో తన పార్టీని బలపరుచుకోవాలని రాహుల్ గాంధీ ఏవిధంగా ఆశిస్తున్నారో తెలియదు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తప్పితే చిరంజీవి అన్నట్లు తయారయింది. మిగిలిన వారందరూ ప్రజలకి మొహం చాటేసి తమతమ వ్యాపారాలు చక్క బెట్టుక్కొంటున్నారు. ఉన్న ఆ ఇద్దరిలో చిరంజీవి తన 150వ సినిమా నిర్మాణంపై కనబరుస్తున్న శ్రద్ధ పార్టీని బలోపేతం చేయడం చూపడం లేదనే మాట వాస్తవం. మరి ఇటువంటి దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ఏవిధంగా రక్షించుకొంటారో చూడాలి.
http://www.teluguone.com/news/content/rahul-gandhi-45-48374.html





