పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు...
Publish Date:Jul 10, 2015
Advertisement
తెలంగాణ ఏసీబీ ఈమధ్య ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టు రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంత బలమైన నాయకుడు కాని సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేశారనేది చాలామందికి అర్థం కాలేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం వుంది. రేవంత్ రెడ్డి చూపిస్తున్న దూకుడు తనకు ఎప్పటికైనా ఇబ్బందిగా మారే ప్రమాదం వుందని కేసీఆర్ భావించారు. అందుకే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే చాలా చిన్న నాయకుడు సండ్రను టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమి వచ్చిందా అనే సందేహం చాలామందికి కలిగింది. కేసీఆర్ సండ్రను అరెస్టు చేయించడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సండ్రను అరెస్టు చేయడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం కాదని... ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని పడగొట్టే వ్యూహం దీని వెనుక వుందని ఈ అంశం గురించి లోతుగా అధ్యయనం చేసిన రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల జరిగే సందర్భంలో, టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలవకపోతే అసెంబ్లీని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెలుసుకున్న కేసీఆర్ ఈ బెదిరింపు ప్రకటన చేశారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టయితే, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళి మంత్రి పదవి పొందిన తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీగా ఓడిపోవడం ఖాయం అయ్యేదే. దాంతో తుమ్మల ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దాంతో అలెర్ట్ అయిపోయిన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ‘అసెంబ్లీ రద్దు’ హెచ్చరిక జారీ చేశారని భోగట్టా. అయితే కేసీఆర్ చేసిన ఈ ప్రకటన చూసి తెలంగాణ తెలుగుదేశం నాయకులు కేసీఆర్ టీడీపీని చూసి భయపడిపోతున్నారని భ్రమించడమే కాకుండా, కేసీఆర్ వ్యూహాలను తక్కువ అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నిన వ్యూహంలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య చిక్కుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
మొత్తమ్మీద కేసీఆర్ పన్నిన వ్యూహంలో సండ్ర కూడా ఇరుక్కున్నారు. అయితే ఈ వ్యవహారం సండ్రతో ఆగే అవకాశం కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సండ్ర తుమ్మల నాగేశ్వరరావుకు ప్రియ శిష్యుడు. తుమ్మల టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లో చేరినప్పుడు సండ్ర తన గురువును అనుసరించలేదు. ఈ విషయంలో తుమ్మలకు సండ్ర మీద కోపం వుందని, అందుకే ఓటుకు నోటు వ్యవహారంలో తన మాజీ శిష్యుడని కూడా చూడకుండా సండ్రను ఇరికించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రాజకీయంగా తన చిరకాల ప్రత్యర్థి అయిన ఓ మాజీ ఎంపీని కూడా సండ్ర ద్వారా ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సూత్రం ఇక్కడ వర్తించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సరే, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు ఎలా వున్నా... ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో వుంది. గౌరవనీయమైన న్యాయస్థానాలే ఈ విషయంలో నిజానిజాలను నిగ్గు తేలుస్తాయి. అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తాయి. అప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలను గమనించడమే మన పని!
http://www.teluguone.com/news/content/telangana-politics-45-48202.html





