కవ్విస్తూ నిందించడం ఆయనకే చెల్లు!
Publish Date:Jul 9, 2015
Advertisement
ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఒక వివాదం సమసిపోక ముందే మరొకటి మొదలవడం సర్వసాధారణం అయిపోయింది. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తుతున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోగా ఆయనే తెలంగాణాకు సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణా ట్రాన్స్ కో నుండి ఏకపక్షంగా 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను తొలగించడం, రెవెన్యూ శాఖలో చేస్తున్న35మంది ఆంధ్రా ఉద్యోగులను తొలగించడం, రెండు రాష్ట్రాలకు చెందాల్సిన సెక్షన్: 10 క్రిందకు వచ్చే 142 సంస్థలన్నిటినీ ఏకపక్షంగా స్వాధీనం చేసుకొని అందులో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను బయటకి పంపాలనుకోవడం వంటి కవ్వింపు చర్యలకి పాల్పడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడుని నిందించడం విచిత్రం. రాజకీయ నాయకులని పదవులు కోల్పోయినా, తొలగించబడినా వారు మళ్ళీ ఏదో విధంగా అధికారం సంపాదించుకోగలరు. కానీ ఉద్యోగులకు అటువంటి అవకాశం ఉండదు. గత రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను ఇలాగ అర్ధంతరంగా తొలగిస్తే వారి పరిస్థితి, వారి మీదే ఆధారపడిన వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రా ప్రజల కాలిలో ముల్లు దిగితే తన నాలికతో తీస్తానన్న పెద్దమనిషి ఇప్పుడు ఏకంగా వారిని రోడ్డున పడేస్తే వారు తమ ఘోడు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఉద్యమ సమయంలో ఇటువంటి దూకుడు వల్ల ఆశించిన ఫలితాలు వచ్చి ఉండవచ్చును. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే దూకుడు ప్రదర్శించడం వలన ప్రభుత్వాల మధ్య, చివరికి ప్రజల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడేందుకే అది దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలున్నాయి. కనుక రెండు ప్రభుత్వాలు వాటిపైనే తమ దృష్టి లగ్నం చేసి పనిచేయాలి తప్ప ఇటువంటి రాజకీయాలతో కాదని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/ap-45-48200.html





