అషురెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
Publish Date:May 8, 2026
Advertisement
పెళ్లి పేరుతో ఎన్నారై వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటి అషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది. ఈ కేసులో విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున, పోలీసులు తమ దర్యాప్తును చట్టప్రకారం కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి సుమారు రూ. 9.35 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అషురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2018 నుంచి వీరి మధ్య ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని.. అమెరికాలో ఎడ్యుకేషన్ లోన్ తీర్చడానికి, కారు, విల్లా వంటి ఆస్తులు కొనడానికి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలను అషురెడ్డి ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఆర్ఐ తనంతట తానుగా, ఇష్టపూర్వకంగానే ఖర్చు చేశారని, ఇందులో ఎటువంటి బలవంతం లేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. పోలీసులు కనీసం తన వెర్షన్ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని, కాబట్టి ఈ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ ( చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. విచారణ సజావుగా సాగాలని ఆదేశిస్తూ.. అషురెడ్డి కోరిన స్టే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అలాగే పోలీసుల కఠిన చర్యల నుండి మినహాయింపు ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఈ కేసులో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/telangana-high-court-rejects-ash-reddy-plea-36-219208.html





