టిమ్స్‌లో 6,278 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ నిర్ణయం..!
Publish Date:Jul 2, 2026
Advertisement
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 1. వీబీజీఆర్‌జీ చట్టం అమలుపై చర్చ..! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీఆర్‌జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలోని నిబంధనలపై క్యాబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని సమావేశంలో గుర్తుచేసుకుంది. మరోసారి తమ నిరసనను అధికారికంగా కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపే విధంగా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ భావనలకు విరుద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ చేసిన సిఫారసులను మంత్రివర్గం పరిశీలించింది. ఇతర రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాయా అనే అంశంపై అధికారులను ప్రశ్నించగా, అన్ని రాష్ట్రాలు అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే, చట్టంలోని నిబంధనలపై న్యాయపరంగా పోరాటం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, పార్లమెంట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని నిర్ణయించింది. 2. ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం..! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు పథకాల అమలులో జవాబుదారీతనం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బంది ఈ పథకం పరిధిలోకి రానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 430 ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 3. టిమ్స్ ఆసుపత్రుల్లో భారీ నియామకాలు..! కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, సిబ్బంది పోస్టులకు ఆమోదం తెలిపింది. మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 4,235 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇక్కడ అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్‌వోసీలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 4. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.7,345 కోట్లు..! మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఫేజ్-1 పనులకు రాష్ట్ర క్యాబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు రూ.7,345.12 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం కొత్తగా 147 పోస్టుల సృష్టికి, ఇతర శాఖల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5. గిడ్డంగుల నిర్మాణానికి భూముల కేటాయింపు..! వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (TGSWC)కు మార్కెట్ రేటు ప్రకారం కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భూముల్లో నిత్యావసర వస్తువుల నిల్వ కోసం ఆధునిక గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. 6. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు భూముల కేటాయింపు..! జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోసం మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అదే విధంగా జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
http://www.teluguone.com/news/content/telangana-cabinet-meeting-36-224904.html





