విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పురోగతి!
Publish Date:May 11, 2026
Advertisement
తనూజ రంజన్ మర్డర్ మిస్టరీ వీడింది.. ఢిల్లీ జైలు నుంచే హత్యకు స్కెచ్.. తనూజ రంజన్ ఇంట్లో పనిమనిషిగా చేరిన కల్పన (30), అదను చూసి ఈ దారుణానికి పాల్పడింది. హత్య అనంతరం భారీగా నగదు, బంగారు ఆభరణాలతో ఆమె పరారైంది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర సహా నేపాల్ సరిహద్దులకు ప్రత్యేక బృందాలను పంపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అనుమానితులను విచారించగా, వారిచ్చిన సమాచారంతో కల్పనను పూణేలో పట్టుకోగలిగారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనుక అంతరాష్ట్ర నేర ముఠా 'సాహూ గ్యాంగ్' హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేవలం దోపిడీ కోసమే ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నేరానికి సంబంధించిన ప్రణాళిక ఢిల్లీ జైలు నుంచే రూపుదిద్దుకోవడం గమనార్హం. జైలులో ఉన్న కొందరు నేరస్థుల సహకారంతో, ముంబై మరియు నేపాల్‌కు చెందిన వ్యక్తులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. హత్య అనంతరం నిందితులు దోచుకున్న బంగారాన్ని ముంబైలోని ఒక రహస్య ప్రాంతంలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు కల్పన ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉండగా, ఆమెను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు? గతంలో ఇలాంటి నేరాలు ఇంకెక్కడైనా చేశారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఒంటరిగా ఉండే వృద్ధులు మరియు ప్రముఖుల ఇళ్లలో పనిమనుషులను చేర్చుకునేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు సేకరించడంతో పాటు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. అపరిచితులను నమ్మి ఇంట్లోకి చేర్చుకోవడం వల్ల ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. నిందితురాలు కల్పనను నగరానికి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం ఉంది.
భాగ్యనగరంలో పెను సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ హత్య కేసులో ఎట్టకేలకు కీలక పురోగతి లభించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితురాలు, పనిమనిషి కల్పనను తెలంగాణ పోలీసులు మహారాష్ట్రలోని పూణేలో అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తున్న ప్రత్యేక బృందాలు, సాంకేతిక ఆధారాల సాయంతో ఆమె ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నాయి.
http://www.teluguone.com/news/content/tanuja-ranjan-murder-case-36-219468.html





