సువేందు అధికారి పీఏ హత్య కేసులో ట్విస్ట్...ఆ ఒక్క క్యూ హంతకులను పట్టించింది!
Publish Date:May 11, 2026
Advertisement
పక్కా ప్లాన్‌తో సువేందు పీఏ హత్య.. టోల్ గేట్ దగ్గర డిజిటల్ పేమెంట్ చేసిన నిందితులు.. హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులకు భారీ విజయం లభించింది. అతి జాగ్రత్తగా ప్లాన్ చేసి తప్పించుకున్న హంతకులను పట్టుకోవడంలో ఒక చిన్న యూపీఐ లావాదేవీ కీలక పాత్ర పోషించింది. టోల్ ప్లాజా వద్ద నిందితులు చేసిన ఆ ఒక్క డిజిటల్ పేమెంట్ ఆధారంగా పోలీసులు వారిని బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్నారు. గత బుధవారం రాత్రి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో చంద్రనాథ్ రథ్ తన కారులో ఇంటికి వెళ్తుండగా దుండగులు మాటువేసి కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు దొరక్కుండా పక్కాగా వ్యూహం రచించినప్పటికీ, తప్పించుకునే క్రమంలో వేసిన ఒక చిన్న అడుగు వారిని కటకటాల వెనక్కి నెట్టింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను, టోల్ ప్లాజా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బ్యాలీ టోల్ ప్లాజా వద్ద హంతకులు ప్రయాణిస్తున్న కారు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ నగదుకు బదులుగా నిందితుల్లో ఒకరు యూపీఐ ద్వారా టోల్ ఫీజు చెల్లించారు. ఆ లావాదేవీకి సంబంధించిన మొబైల్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. టెక్నికల్ సర్వైలెన్స్ సాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేసిన బెంగాల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ , వారు పొరుగు రాష్ట్రాలకు పారిపోయినట్లు నిర్ధారించుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు కరుడుగట్టిన షార్ప్ షూటర్ విశాల్ శ్రీవాస్తవ అని గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా లేదా వ్యక్తిగత కక్షలా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సువేందు అధికారి మాత్రం ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన రాజకీయ హత్యేనని ఆరోపిస్తున్నారు. నిందితులు విదేశీ తయారీ గ్లాక్ పిస్టల్‌ను వాడటం గమనార్హం. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పట్టుబడ్డ నిందితులను కోల్‌కతాకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వారిని లోతుగా విచారించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాల్లో మరోసారి శాంతిభద్రతల అంశం చర్చనీయాంశమైంది. బాధితుడికి న్యాయం జరగాలని, ప్రధాన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/suvendu-adhikari-pa-murder-36-219465.html





