ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ్ రెడ్డికి జైలు.. సుప్రీం తీర్పు
Publish Date:Feb 17, 2026
Advertisement
తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలని తీర్పు ఇచ్చింది. నటి ప్రత్యూష 2002లో ఆమె స్నేహితుడు సిద్ధార్థరెడ్డితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యూష చికిత్స పొందుతూ మరణించగా, సిద్ధార్థ కోలుకున్నాడు. అయితే అప్పట్లో ప్రత్యూషది ఆత్మహత్య కాదనీ, ఆమె హత్యకు గురైందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ సిద్ధార్ధరెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసింది. హైకోర్టు సిద్ధార్థ్ రెడ్డికి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంను ఆశ్రయించగా సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ నేడు తీర్పు వెలువరించింది. కేసు వివరాల్లోకి వెడితే.. భువనగిరికి చెందిన ప్రత్యూష పిన్న వయస్సులోనే చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వర్థమాన నటిగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ స్టేటస్ కు చేరుకున్నారు. మోహన్ బాబు హీరోగా నటించిన రాయుడు సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రత్యూషకు ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తొలి సినిమాతోనే అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ గుర్తింపుతో వరుసగా తెలుగు, తమిళ సినిమాలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పురుగుల మందు తాగి మరణించారన్న వార్త సంచలనం సృష్టించింది. 2002 ఫిబ్రవరి 24న తన 20 ఏళ్ల వయస్సులో ప్రత్యూష తన స్నేహితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డిలు 2002 ఫిబ్రవరి 23న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలయ్యారు. ప్రత్యూష చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న మరణించింది. ఆమె స్నేహితుడు సిద్ధార్థ కోలుకుని మార్చి 9న సిద్ధార్థ డిశ్చార్చి అయ్యాడు. అయితే ప్రత్యూష మృతి పట్ల అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యూషది ఆత్మహత్య కాదనీ, ఆమె హత్యకు గురైందనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యూషది హత్యేనని ఆరోపిస్తూ ఆమె తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటానికి దిగారు. ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. ప్రత్యూషది ఆత్మహత్యేనని తేల్చింది. అయితే ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, సెక్షన్ ఆత్మహత్యకు యత్నించడం తదితర కేసులు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిద్ధార్థకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004లో తీర్పు వెలువరించారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ హైకోర్టును ఆశ్రయంచగా, కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ హైకోర్టు 2011లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చూస్తూ సిద్ధార్థ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రత్యూష తల్లి కూడా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి, హైకోర్టు విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సిద్ధార్థ.. వేర్వేరుగా పిటిషన్లు ధాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం గత ఏడాది నవంబర్ లో తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఆ రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం వెలువరించింది. అంటే సిద్ధార్థకు రెండేళ్ల జైలు, రూ.50 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/supreme-verdict-in-pratusha-death-case-36-214219.html





