పాక్‌లో మరో ఆత్మాహుతి దాడి - 16 మంది మృతి
Publish Date:Feb 21, 2026
Advertisement
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో శనివారం ఫిబ్రవరి 21)న జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది మరణించారు. మృతులలో ఇద్దరు పాక్ సైనికులు, ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు. మృతులలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారితో పాటు పౌరులూ ఉన్నట్టు సమాచారం. ఈ పేలుడులో పలువురు సైనికులు గాయపడ్డారు. పాకిస్థాన్ లో పక్షం రోజుల వ్యవధిలో ఇది మూడో ఆత్మాహుతి దాడి కాగా.. ఐదు రోజుల్లో రెండోది కావడం గమనార్హం. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను జిల్లా సరార్ దర్గా ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని పాక్ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో ఆత్మాహుతి దళ సభ్యుడు సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే.. సైన్యానికి చెందిన వాహనం దాడులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించినది కావడంతో అది పేలిపోలేదు. పేలుడు ధాటికి ఓ నిఘా సంబంధిత ఆపరేషన్లో పాల్గొంటున్న కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ షాజాదా గుల్ మృతిచెందినట్టు సమాచారం. అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవలి కాలంలో ఉగ్ర సంఘటనలు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం.. తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) బజౌర్ జిల్లాలోని ఓ చెక్‌పాయింట్‌ను పేలుడు పదార్థాలతో కూడిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది భద్రతా సిబ్బంది సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
http://www.teluguone.com/news/content/sucide-attack-in-pakisthan-36-214475.html





