ఆయనకు తిక్కుంది... దాని వెనుక అర్థం కాని లెక్కుంది!
Publish Date:Feb 13, 2017
Advertisement
సుబ్రమణియన్ స్వామి... ఈయన పేరు చెబితే దాదాపు అన్ని పార్టీల వారు భయపడిపోతారు! అలా భయపడే వారి లిస్ట్ లో ఆయన స్వంత పార్టీ బీజేపి నేతలు కూడా వుంటారు! స్వామివారికి ఆగ్రహం వస్తే ఎంతటి వారిపైనైనా స్వారీ చేసేస్తారు! సుబ్బుతో పెట్టుకుంటే సబ్బు పెట్టి కడిగేస్తాడని ప్రతీతి! తమిళనాడులో జరుగుతోన్న రాజకీయ జల్లికట్టులో బీజేపి పార్టీదీ, కేంద్ర ప్రభుత్వానిది, ఒక విధంగా .. మోదీది మద్దతు ఎవరికో అందరికీ తెలిసిందే! పన్నీర్ కే పట్టం కట్టాలని కమలనాథులు ఆశిస్తున్నారు. అయితే, సుబ్రమణియన్ స్వామి మాత్రం రివర్స్ రూటులో వెళుతున్నాడు. ఆయన శశికళ కోసం రంగంలోకి దిగాడు. నేరుగా తనకు అలవాటున్న కోర్టు మెట్లెక్కి పీటీషన్ వేసేశాడు! తమ కేంద్ర ప్రభుత్వమే నియమించిన తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చేత శశికళకు ఆహ్వానం పంపాలని కోర్టును కోరాడు! అసలు సుప్రీమ్ కోర్టులో అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తోన్న శశికళ సీఎంగా ఎలా పనికి వస్తుంది? పోనీ సుబ్రమణియన్ స్వామికి సదరు కేసు గురించి తెలియదా అంటే... ఆ కేసు వేసి జయలలితను, శశికళను జైల్లో పెట్టించిందే ఆయన! కాని, ఇప్పుడు మాత్రం తప్పు చేసిందని ఆయన గతంలో తిట్టిపోసిన మన్నార్ గుడి మాఫియా మహారాణి శశికళే... సీఎం అవ్వాలంటున్నాడు! సుబ్బు లాజిక్ చాలా సింపుల్ అనే చెప్పాలి శశికళ విషయంలో! ఆమెకు అవసరానికి తగినంత మద్దతు ఎమ్మెల్యేల నుంచి వుంది. కోర్టు తీర్పు ఎలా వచ్చినా ఆమె సీఎం అవ్వటం ఖాయం. గవర్నర్ ఎన్ని రోజులు ఆపినా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే. కాబట్టి ఆమెకు మద్దతుగా నిలిచి అందరి ముందు తాను న్యాయం వైపు వుంటానని నిరూపించుకోవటం ఆయన ఉద్దేశం. అలాగే, రేపు శశికళ సీఎంగా పీఠంపై స్థిరంగా కూర్చోగలిగితే ఆమెను కేంద్రానికి, బీజేపికి దగ్గర చేసే ఛాన్స్ కూడా ఆయనకు వుంటుంది. అంటే, తమిళ పాలిటిక్స్ లో ఢిల్లీ నుంచీ చక్రం తిప్పవచ్చన్నమాట! సుబ్రమణియన్ స్వామి తిక్క, దాని వెనుక వున్న లెక్కా ఎలా వున్నా.... ఇప్పడు మాత్రం బీజేపికి ఆయన కంటిలో నలుసులా మారాడు! తమిళనాడులో బలంగా స్థిరపడాలని చూస్తూ, అందుకోసం పన్నీర్ ను తమ పాస్ పోర్ట్ గా భావిస్తున్న కమలనాథులు తమ స్వంత నేత వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడుతున్నారు! ఒకవైపు వెంకయ్య తమిళనాడులో సీఎం పదవి ఖాళీ లేదంటూ శశికళకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే... సుబ్బూ మాత్రం కొందరు కేంద్ర మంత్రులు చెన్నై రాజకీయాల్లో అతిగా కలగజేసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నాడు! చివరికి స్వామి సహకారం శశికి ఎంత మేర ఉపయోగపడుతుందో... చూడాలి!
http://www.teluguone.com/news/content/subramanian-swamy-45-72093.html





