శశికళ సహనం నశిస్తోంది... పన్నీర్ వ్యూహం ఫలిస్తోంది!
Publish Date:Feb 11, 2017
Advertisement
తమిళనాడు సీఎం ఎవరు అవుతారు? శశికళనా? పన్నీర్ సెల్వమా? ఈ ప్రశ్నలకి సమాధానాలు అంత తేలిగ్గా దొరికేవి కావు. ప్రస్తుతానికి అందరూ ఒకరిని మించి ఒకరు తెలివిగా పావులు కదుపుతున్నారు. శశికళ ఎమ్మెల్యేల్ని బంధించి పట్టుబిగిస్తే... ఆమె ప్రజా ప్రతినిధుల్ని నిర్బంధించిందనే అంశమే ఆమెకు వ్యతిరేకంగా పన్నీర్ వాడుతున్నాడు. మరో వైపు గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ మాత్రం తొందరపాటు లేకుండా రూల్స్ ప్రకారం అడుగులు వేస్తున్నారు. తనని ఎవ్వరి తప్పుపట్టటానికి లేకుండా చర్యలు తీసుకుంటూనే శశికళకి చెక్ పెడుతున్నారు. మధ్యలో శశి, పన్నీర్ క్యాంపుల్లో వున్న ఎమ్మెల్యేలు కూడా తమ లాభ, నష్టాలు, భవిష్యత్ అంచనా వేసుకుని స్టేట్మెంట్లు ఇస్తున్నారు! చెన్నై రాజకీయం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతున్నా శశికళ మాత్రమే అందరికంటే ఎక్కువ ప్రభావితం అవుతోన్నట్టు కనిపిస్తోంది. ఆమె ఆశలు అంతకంతకూ అడియాసలు అవుతున్నకొద్దీ సహనం నశించి చిరాకు, కోపం, ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది! పన్నీర్ సెల్వం చాలా సౌమ్యుడుగా, విధేయుడుగా కనిపిస్తూనే తన అపార రాజకీయ అనుభవం ఇంతకాలం జయ చాటు నిచ్చెలిగా వున్న శశిపై ప్రయోగిస్తున్నాడు. గడిచే ఒక్కో రోజుకీ పన్నీర్ ప్రజల నాయకుడిగా మారుతున్నాడు. అదే సమయంలో శశికళ సీఎం పదవి కోసం పాకులాడుతున్న కరుడుగట్టిన నాయకురాలిగా మారిపోతోంది! దానికి తోడు తాజాగా చిన్నమ్మ చేసిన హెచ్చరిక జనంలోకి మరింత నెగటివ్ సిగ్నల్స్ పంపినట్టే అనిపిస్తోంది! శశికళ పొయెస్ గార్డెన్ లో అన్నాడీఎంకే కార్యకర్తలతో మాట్లాడుతూ ఎవరి సహనానికైనా హద్దుంటుందీ అంటూ వారెంట్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా పన్నీర్ సెల్వమ్ కి మాత్రమే కాదు. తమ సహనం నశిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయని ఆమె పన్నీర్ కి, ఆయన వెనుక వున్న డీఎంకే, బీజేపి లాంటి పార్టీలకి కూడా హెచ్చరిక పంపారు. ఇదే శశికళ చేసిన తప్పు. ఎందుకంటే, ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మధుసూదనన్ లాంటి సీనియర్ నేతలు ఆమెనే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించే దాకా పరిస్థితి వెళ్లిపోయింది! ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్ నాయకుడు శశికళ చేజారిపోతున్నారు! ఇటువంటి సమయంలో ఆమె తగ్గి వుండాలి. కాని, అలా కాకుండా గవర్నర్ తో సహా అందరికీ వర్తించేలా సహనం నశిస్తుంది అంటూ చెప్పటం దురుసుతనమే అవుతుంది! ప్రజల్లో మిగిలిన మద్దతు కూడా ఇంకిపోయే అవకాశం వుంది! అవినీతి కేసులు, సుప్రీమ్ తీర్పు, జయ మృతిపై చాలా మందికున్న అనుమానాలు, మన్నార్ గుడి మాఫియా అనే ముద్ర ... ఇన్నీ వున్న శశికళ సీఎం అవ్వటం చాలా కష్టం. అలాంటప్పుడు దురుసుగా, దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడితే ముందుకు సాగటం మరింత కష్టమవుతుంది. అసాధ్యం కూడా అవ్వచ్చు. ఎందుకంటే, మొండితనం జయలలిత లాగా జనంలో ఫాలోయింగ్ వున్న వారికి చెల్లుతుంది కాని... అందరికీ కాదు!
http://www.teluguone.com/news/content/jayalalitha-45-72061.html





