సృష్టి కేసులో డాక్టర్ నమ్రతకు ఈడీ కస్టడీ
Publish Date:Feb 23, 2026
Advertisement
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన డాక్టర్ నమ్రత కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెను రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరినప్ప టికీ, కోర్టు రేపు మరియు ఎల్లుండి మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రెండు రోజులలో డాక్టర్ నమ్రతను మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు, విదేశీ ఖాతాలకు నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు. సరోగసీ ప్రక్రియను ముసుగుగా చేసుకుని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, వాటిని అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఆమెకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, అనుబంధ సంస్థల వివరాలు ఈడీ సేకరించినట్లు సమాచారం. సేకరించిన డబ్బును షెల్ కంపెనీలు, మధ్యవర్తుల ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు, విదేశీ లింకులపై అధికారులు ఫోకస్ పెట్టారు.ఈ వ్యవహారంలో డాక్టర్ నమ్రతతో కలిసి పనిచేసిన వ్యక్తులు, మధ్యవర్తులు, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించిన కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఈడీ విచారణ జరపనుంది. సరోగసీ పేరుతో డబ్బు వసూలు చేసిన విధానం, లబ్ధిదారుల వివరాలు, అక్రమంగా నిర్వహించిన ఒప్పందాలపై ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అంశాలు దృష్ట్యా మరికొంతమంది పాత్ర బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డబ్బు మళ్లింపుకు ఉపయోగించిన ఖాతాలు, విదేశీ కనెక్షన్లు, ఆస్తుల కొనుగోళ్లపై కూడా ఈడీ దర్యాప్తు విస్తరించే అవకాశముంది. రెండు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం డాక్టర్ నమ్రతను తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు సృష్టి సరోగసీ కేసులో మరిన్ని సంచలనాలను రాబట్టే అవకాశం ఉందని న్యాయవర్గాలు, దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/srushti-surrogacy-case-36-214558.html





