ఫ్రీ పబ్లిసిటీ లడ్డూ కావాలా నాయనా... శోభా డేను ఫాలోకండి!
Publish Date:Aug 21, 2016
Advertisement
అడుసు తొక్కనేలా కాలు కడగనేలా.... ఇదో చాలా పాత సామెత! అంతకంటే పురాతన విమర్శకురాలు శోభా డే! అవును... ఆమె అప్పుడెప్పుడో కొన్ని పుస్తకాలు రాసిందంటారు. అవి కూడా బూతు సాహిత్యం అని కొందరు కొట్టిపారేస్తారుగాని చాలా వరకూ బోల్డ్ రైటింగ్స్ అని మెచ్చుకుంటారు! అయితే, శోభా డే ఎంతమందికి నచ్చినా, నచ్చకపోయినా పేజ్ త్రీ సర్కిల్స్ లో మాత్రం సూపర్ పాప్యులర్. పైగా ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియా జడలు విప్పిన తరువాత, సోషల్ మీడియా విశృంఖలంగా మారిన తరువాత ఈమెకి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ వచ్చింది. అది తాజా రియో ఒలంపిక్స్ సందర్భంలో నానా యాగీకి కారణమైంది... ఒలంపిక్స్ లో భారత్ పర్ఫామెన్స్ పెద్దగా అభినందనీయంగా వుండదనేది ఇప్పుడే కొత్తగా తెలిసిందేం కాదు. అసలు ఒలంపిక్స్ చరిత్రలో ఎప్పుడూ ఇండియా ఇరగదీసింది ఏం లేదు. కాని, శోభా డే వున్నట్టుండీ ట్విట్టర్ లో చెలరేగిపోయింది. ఆ మధ్య మోదీ సర్కార్ వచ్చాక అసహనం పెరిగిపోయిందని, మైనార్టీల కంటే ఎక్కువగా తానే భయపడిపోతున్నానని శోభా డే తెగ ఆవేశపడింది. అప్పుడు కూడా ఆమెను ట్విట్టర్ లో జనం అదేదో చేసి చెవులు మూసినంత పని చేశారు. అంతే మరి... కాంగ్రెస్ వున్నంత కాలం ఏ మాత్రం గుర్తుకు రాని అసహనం బీజేపి రాగానే శోభా డేకు జ్ఞాపకం వచ్చిందంటే ఏమనాలి? ట్విట్టర్ ద్వారా ట్రాల్ అవుతూ మీడియాలో మజా చేయటం ఓ సారి అలవాటయ్యాక ఎవరికైనా ఆ ఫ్రీ పబ్లిసిటీ ఎలా వదులుకోబుద్దవుతుంది? అందుకే, ఒలంపిక్స్ రాగానే శోభా కొత్త శోభతో వెలిగిపోయింది. అథ్లెట్లు రియోకు వెళ్లేది సెల్ఫీలు తీసుకోవటానికని నోటికొచ్చినట్టు కామెంట్స్ చేసింది. అందుకు ప్రతిఫలంగా టీవీ ఛానల్స్ మొదలు అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ వరకూ అంతటా, అంతా శోభాకు మొట్టికాయలు వేశారు. మరీ ముఖ్యంగా సింధు, సాక్షి మాలిక్ పతకాలు గెలిచాక శోభా డేకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. ఒలంపిక్స్ విషయంలో తన వాగుడు అసలుకే మోసం తెచ్చిందనుకున్న శోభా డే ఇక రియో సంబరాలు అయిపోతున్న వేళ సింధు, దీపా కర్మాకర్, సాక్షీల్ని తెగ పొగిడేస్తు తాజా ట్వీట్స్ చేసింది. ఆహా ఓహో అంటూ ప్లేటు ఫిరాయించింది! మరి ఈ మాత్రం దానికి కొన్ని రోజులు పాటూ నెగటివ్ ట్వీట్స్ చేస్తూ డ్రామాలు నడపటం ఎందుకు? పబ్లిసిటీ కోసమేనా? అయితే, శోభా సక్సెస్ అయినట్టే! ఆమె గాని పిచ్చి మాటలు మాట్లాడి వుండకపోతే ఎవ్వరూ పట్టించుకునే వారు ఈ ముదురు రైటర్ అండ్ జర్నలిస్ట్ ని!
http://www.teluguone.com/news/content/shobha-de-45-65398.html





