షేన్‌వార్న్- ది లెజెండ్.. మనిషి కాదు వాడు స్పిన్ మాంత్రికుడు..
Publish Date:Mar 5, 2022
Advertisement
షేన్‌వార్న్.. అతను మనిషి కాదు మెషిన్. స్పిన్ మాంత్రికుడు. బాల్‌తో మేజిక్ చేస్తాడు. బంతిని గింగిరాలు తిప్పడంలో ఎక్స్‌పర్ట్. బంతిని పిచ్‌పై 45 డిగ్రీల కోణంలో స్పిన్ చేయగల పోటుగాడు. లెగ్‌స్టంప్ అవతల బంతి పడితే.. వైడ్ వెళుతుందేమోనని వదిలేస్తాడు బ్యాట్స్‌మెన్. కానీ, అది గిర్రున తిరిగి.. వికెట్ పడేస్తుందని ఆ టైమ్‌కు ఎవరూ ఊహించలేరు. ఆ ట్రిక్ అప్పట్లో షేన్‌వార్న్‌కు మాత్రమే తెలుసు. అలా.. లెగ్‌స్పిన్‌తో వందలాది వికెట్లు తీసిన బెస్ట్ బౌలర్. అందులో, అనేక వికెట్లు.. మరిపించి మాయ చేసేవే. ప్రేక్షకులను మెప్పించి.. అవాక్కయ్యేలా చేసేవే. షేన్‌వార్న్ మణికట్టులో ఏదో మహత్తు ఉంది. ఆ చేతిలో ఏదో శక్తి ఉంది.. అంటారు అభిమానులు. మ్యాజిక్ బంతులతో.. షేన్ వార్న్ వన్డేల్లో 293 వికెట్లు, టెస్టుల్లో 708 వికెట్లు తీశాడు. 1969లో విక్టోరియాలో జన్మించిన వార్న్ 23 ఏళ్లకు ఆస్ట్రేలియా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 1992లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి ఉసూరుమనిపించాడు. ఆ తర్వాత తెలిసింది.. క్రికెట్‌కు ఓ అద్భుత లెగ్ స్పిన్నర్ దొరికాడని. ఆయన క్రికెట్ కెరీర్‌లో అనేక రికార్డులు..సంచలనాలు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే వరకూ.. షేన్ వార్న్ తిరుగులేని ప్రదర్శన ఇచ్చాడు. ఆయన బౌలింగ్ లానే.. షేన్‌వార్న్ లైఫ్‌స్టైల్ కూడా ఎప్పుడూ గింగిరాలు తిరుగుతూనే ఉండేది. ఏదొక వివాదంతో నిత్యం వార్తల్లో ఉండేవాడు. ఓ బుకర్ నుంచి సొమ్ము తీసుకున్నట్లు షేన్ వార్న్‌తో పాటు మార్క్‌వాపై 1998లో ఆరోపణలు వచ్చాయి. పిచ్, వెదర్ రిపోర్ట్ గురించి చెప్పేందుకు శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తితో మాట్లాడినట్టు వివాదం చెలరేగింది. ఇక, 1999 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అప్పటి లంక కెప్టెన్ అర్జున్ రణతుంగను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలతో రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. 2003 వరల్డ్ కప్ ముందు డ్రగ్స్ వ్యవహారం పెను దుమారం రేపింది. 2013లో బిగ్‌బాష్ లీగ్‌లో మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు 4,500 డాలర్ల జరిమానా కట్టాడు. ఇలా షేన్‌వార్న్ కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచాడు. ఎన్ని వివాదాలు ఉన్నా.. లెగ్ స్పిన్‌లో ది బెస్ట్ బౌలర్ అంటే షేన్‌వార్నే అంటారు. ఒక్క సచిన్ మినహా.. టాప్ మోస్ట్ బ్యాట్స్‌మెన్ అంతా వార్న్ బౌలింగ్‌కు బెదిరిన వారే. అంతా ఆయనకు భయపడితే.. షేన్‌వార్న్ మాత్రం తనకు సచిన్‌కు బౌలింగ్ చేయడమంటే భయమని ఆయనే ఓ సందర్భంలో చెప్పాడు.
http://www.teluguone.com/news/content/shane-warne-the-legend-bowler-25-132620.html





