వివేకా అంటే జగన్‌కు కోపం!.. హత్య కేసులో మరింత సంచలనం
Publish Date:Mar 5, 2022
Advertisement
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీ ఛేదించడంలో సీబీఐ అధికారులు మరింతగా దూకుడు పెంచారు. రాజకోట రహస్యం మాదిరిగా జరిగిన పులివెందుల కోట హత్య కేసులో ఒక్కొక్కరి వాంగ్మూలమూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన ముద్దాయి దస్తగిరి వాంగ్మూలం మొదలు.. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇతరులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలన్నీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపైనే వేలు పెట్టి చూపిస్తుండడం గమనార్హం. ఈ హత్య కుట్ర వెనుక వైఎస్ జగన్ పథక రచన చేసి ఉండవచ్చని రాజశేఖర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేసిన విషయం ఆయన ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెలుగులోకి వచ్చింది. అందుకు ఆయన కొన్ని సంఘటనలను ఉదహరించారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకుని జగన్, అవినాష్ రెడ్డి లబ్ధిపొందారని చెప్పడం విశేషం. వివేకా కుమార్తె సునీత కూడా అవినాష్ రెడ్డినే సూత్రధారి అంటూ వాంగ్మూలం ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఆమె లోక్ సభ స్పీకర్ కు కూడా లేక రాయడం విశేషం. కాగా.. ఇప్పుడు వివేకానందరెడ్డి బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అవినాష్ రెడ్డి, జగన్ ల మీద అనుమానాలు మరింతగా పెంచే విధంగా ఉంది. వివేకా హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని సీబీఐకి శివప్రకాశ్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో ఆయన పేర్కొన్న పెద్ద నాయకులు ఎవరనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. అయితే.. శివప్రకాశ్ రెడ్డి వ్యక్తం చేసిన అనుమానాల వెనుక అసలు విషయం అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి ఆ పెద్ద నాయకులు కావచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. వివేకానందరెడ్డి గొడ్డలి పోటుతో మరణించినప్పటికీ దాన్ని ‘గుండెపోటు’ అంటూ ప్రచారం చేసిన వ్యక్తులకు ఈ హత్య కుట్రలో ప్రమేయం ఉందని వాంగ్మూలంలో చెప్పడం. హత్య కుట్రలో తమ పాత్ర లేకపోతే ఘటనా స్థలంలో ఆధారాలను చెరిపించాల్సిన అవసరం వారికి ఎందుకు వచ్చిందనేది వివేకానందరెడ్డి బావమరిది సూటి ప్రశ్న. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, చిన్నాన్న మనోహర్ రెడ్డి సమక్షంలో ఆధారాల ధ్వంసం జరిగిందని చెప్పారు. శివప్రకాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో మరో కఠిన వాస్తవాన్ని కూడా స్పష్టంగా బయటపెట్టారు. తన బావ వివేకానందరెడ్డికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2004 ఎన్నికల నుంచే విభేదాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ తనకే కావాలంటూ జగన్ పట్టుపట్టారట. అయితే.. అప్పుడు ఆ టికెట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు వైఎస్ వివేకాందరెడ్డికే వచ్చింది. ఇది జగన్ కు ఏమాత్రం ఇష్టంలేకపోయిందట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో వివేకానందరెడ్డి చేరారు. అది కూడా జగన్ కు ఏమాత్రం నచ్చలేదట. జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి 2010 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం వివేకానందరెడ్డి ఇష్టం లేదట. అందుకే తొలుత వైసీపీలో వివేకా చేరలేదనే విషయం శివప్రకాశ్ రెడ్డి బయటపెట్టారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ విజయమ్మ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత వివేకా సోదరుడు సుధీకర్ రెడ్డి, వివేకా అనుచరులు వైసీపీలో చేరాలని కోరడంతో ఆ పార్టీలో చేరారని శివప్రకాశ్ రెడ్డి బయటపెట్టారు. అయితే.. వివేకానందరెడ్డిని వైసీపీలో చేర్చుకోడానికి జగన్ రెడ్డి ముందు నో చెప్పారట. తర్వాత జగన్ ఒప్పుకోవడంతో 2012 డిసెంబర్ లో వివేకానందరెడ్డి వైసీపీలో చేరారు.. అయినప్పటికీ వివేకా- జగన్ మధ్య విభేదాలు కొనసాగేవని ఆయన బావమరిది శివప్రకాశ్ వాంగ్మూలంలో చెప్పడం ఈ హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉంటుందో ఊహించవచ్చని అంటున్నారు. మరో పక్కన సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి కన్నా వైఎస్ అవినాష్ రెడ్డితోనే జగన్ కు బాగా దోస్తీ ఏర్పడడానికి వైఎస్ భారతి దగ్గరి బంధువు కావడం ఒక కారణం అనేది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి వాంగ్మూలాన్ని బట్టి అర్థం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ సతీమణి వైఎస్ భారతి తల్లి.. వైఎస్ భాస్కర్ రెడ్డికి స్వయానా సోదరి. జగన్- భారతి పెళ్లి తర్వాత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని జగన్ కు బాగా దగ్గరయ్యారట. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ రావడానికి మూడు కారణాలున్నట్లు శివప్రకాశ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెల్లడవుతోంది. మొదటిది అవినాష్ రెడ్డి వైఎస్ భారతి స్వయానా మేనమామ కొడుకు కావడం.. రెండోది వైఎస్ విజయమ్మపై 2011 లో కడప ఉప ఎన్నికల్లో వివేకానందరెడ్డి పోటీ చేయడం.. మూడోది వివేకానందరెడ్డికి టికెట్ విషయంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అనుకూలంగా లేకపోవడం. ఇంకో పక్కన వివేకానందరెడ్డి వైసీపీలో చేరడం కూడా వారికి సుతరామూ ఇష్టం లేదట. ఆ క్రమంలోనే వివేకాకు 2017లో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు శివప్రకాశ్ రెడ్డి వాంగ్మూలం వెల్లడిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా వివేకా వైసీపీ తరఫున తిరగడం భాస్కర్ రెడ్డి కుటుంబానికి రుచించలేదట. వాటికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కారణం అని వివేకా రగిలిపోయే వారట. అవినాష్ రెడ్డి గ్రూపుతో తన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి జట్టు కట్టడం వివేకాకు నచ్చలేదు. అందుకే గంగిరెడ్డిని వివేకా దూరం పెట్టారు. ఇలాంటివన్నీ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చేందుకు కారణం అయ్యాయని ఆయన బావమరిది శివప్రకాశ్రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెల్లడవుతున్న అంశాలు. ఇప్పుడు సీబీఐ ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ క్రమంలోనే వివేకా హత్యకేసులో ఒక్కక్కరి వాంగ్మూలం బయటికి వస్తున్నాయి. వివేకా మర్డర్ కేసులో ఏ వాంగ్మూలం చూసిన అవినాష్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నాయి. సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వారి ఇంటికి వెళ్లినా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాటిని తీసుకోలేదు. దాంతో సీబీఐ అధికారులు కడప కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో ఆయనకు నోటీసులు ఇచ్చి, అరెస్టు చేసేందుకు రంగం చేస్తున్నారని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/disputes-between-ys-vivekananda-reddy-and-ys-jagan-25-132623.html





