ఓ వైపు మండుటెండలు.. మరో వైపు వర్షాలు, పిడుగులు.. ఏపీలో భిన్న వాతావరణం
Publish Date:May 12, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలతో విభన్న వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్రలో పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయనీ, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి కీలక సూచనలు జారీ చేసింది. విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 104 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని పేర్కొంది. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇలా భిన్న వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
http://www.teluguone.com/news/content/scorching-heat-and-rains-36-219592.html





