ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తులు మృతి
Publish Date:May 12, 2026
Advertisement
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మంగళవారం (మే 12) భారీ విషాదం చోటుచేసుకుంది. జత్ తాలూకాలోని మోతేవాడి గ్రామంలోని మర్గుబాయి దేవి ఆలయ గోడ ఒక్కసారిగా కూలి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు స్థానికులు కాగా.. మిగిలిన ముగ్గురు కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆలయ ప్రాంగణంలో మర్గుబాయి దేవి యాత్ర వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. గాలి తీవ్రతకు తట్టుకోలేక భక్తులు తలదాచుకునేందుకు సమీపంలో నిర్మాణంలో ఉన్న గోడ వద్దకు వెళ్లారు. అదే సమయంలో గాలి వేగానికి అక్కడి రేకుల షెడ్డు కూలి గోడపై పడింది. దీంతో ఆ గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాంగ్లీలో జరిగిన ఈ ప్రమాదం తనను కలచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
http://www.teluguone.com/news/content/temple-wall-collapses-36-219591.html





