జబర్ధస్త్ 'యాక్షన్ సీన్స్'తో ఆకట్టుకున్న రోజా!
Publish Date:Feb 11, 2017
Advertisement
సాధారణంగా నటన అంటే సినిమా వాళ్లకే చెల్లుతుంది! వారిలా ఇంకెవరూ నటించలేరు. కాని, అప్పుడప్పుడూ రాజకీయ నాయకులు కూడా నిజ జీవితంలో భలే నటిస్తుంటారు! మేకప్ లేకుండానే మీడియా కెమెరాల ముందు అదరగొట్టేస్తుంటారు! తమిళనాడులో శశికళ, ఆమె అనుచరులు, పన్నీర్ , ఆయన వర్గం... ఎలా చూడ చక్కగా యాక్టింగ్ రక్తి కట్టిస్తున్నారో మనం చూస్తూనే వున్నాం! అయితే, ఒక్కోసారి సినిమా వాళ్లే రాజకీయాల్లోకి వచ్చి రచ్చ చేస్తుంటారు. అప్పుడు వారి యాక్టింగ్ అయితే మాటల్లో వర్ణించలేం! విజయవాడలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతున్న వేళ రోజా నట విశ్వరూపమే చూపించింది. అందులో పాల్గొనాలని బయలుదేరిన ఆమె పోలీసులు అరెస్ట్ చేయటంతో జబర్దస్త్ పర్ఫామెన్స్ కి తెర తీసింది. అసలు ఆమెను మీటింగ్ కి రమ్మంటూ ఆహ్వానం పలికిన ప్రభుత్వం మళ్లీ అరెస్ట్ ఎందుకు చేయించిందో పాలకులకే తెలియాలి. కాదంటే పోలీసులే స్వంత నిర్ణయం తీసుకుంటే వారెందుకు ఒక ప్రజా ప్రతినిధితో అలా ప్రవర్తించారో వివరణ ఇవ్వాలి. కాకపోతే, ఇక్కడ ఎవరెవరి తప్పు వున్నా రోజా హంగామా మాత్రం అందర్నీ ఆకట్టుకుంది! ఒక ఎమ్మెల్యే అయిన ఆమె పోలీసులు అరెస్ట్ చేస్తే నడి రోడ్డు మీద జీపులోంచి దూకేసింది! కాపాడండీ అంటూ పరుగులు తీసింది! అంతే కాక పోలీసుల అదుపులో వుండగానే సెల్ఫీ వీడియో తీసుకుని నానా విమర్శలు చేసింది. పనిలో పనిగా వెంకయ్య కుమార్తె, చంద్రబాబు కోడలు, కేసీఆర్ కూతుర్ని కూడా విమర్శల్లోకి లాగింది. ఆ వీడియోని మీడియాకి పంపి పర్ఫామెన్స్ అదరగొట్టేసింది! అసలు ఇలాంటి ప్రవర్తన ఒక ఎమ్మెల్యే నుంచి సమర్థించవచ్చా? పోలీసులు అరెస్ట్ చేయటం తప్పైతే కావొచ్చేమోగాని రోజా కూడా హుందాగా ప్రవర్తించాలి కదా? పోలీస్ వాహనం నుంచి తప్పించుకోవటం బాధ్యత అనిపించుకుంటుందా? రాజకీయ కెరీర్లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన రోజా అసెంబ్లీలో లోపల, బయట, చివరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సుల సందర్భంలో వీలైనంత యాక్టింగ్ తో అలరిస్తున్నారు. ఇలా కాకుండా జనం సమస్యల్ని ప్రస్తావిస్తూ, ఎన్నుకున్న నియోజకవర్గానికి మేలు చేస్తే వచ్చే ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వుంటాయి. విమర్శకులు చెబుతోన్న ఈ మాట రోజమ్మ వింటారో లేదో...
http://www.teluguone.com/news/content/roja-45-72056.html





