జయ, శశికళకి తప్పని కోర్టు గండం... జగన్ కి తప్పుతుందా?
Publish Date:Feb 11, 2017
Advertisement
జయతో పాటూ ముప్పై ఏళ్ల జీవితం పంచుకున్న శశి ఆమెపై పడ్డ అవినీతి మచ్చని కూడా పంచుకుంది! అక్రమాస్తుల కేసులో ఏ2గా సుప్రీమ్ కోర్టుదాకా వెళ్లింది. ఇప్పుడు ఆ కేసులో తీర్పే కొంప ముంచేలా వుంది. ఎమ్మెల్యేల మద్దతు వున్నా శశికళ సీఎం అవ్వలేకపోవటానికి కారణం అవినీతి ఆరోపణలే! ఇక మన రాష్ట్రంలో ఈడీ దూకుడు చూస్తుంటే కూడా జగన్ పరిస్థితి శశికళ లాగే అనిపిస్తోంది! ఆమెకి, మన యువనేతకి సంబంధం ఏంటి అంటారా? అవినీతి మరకలే! మొన్నటికి మొన్న 9వందల సరస్వతీ సిమెంట్స్ భూముల్ని ఈడీ అటాచ్ చేసింది. వైసీపీ అధినేత ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైద్రాబాద్ ఆస్తులపై కూడా దృష్టి పెట్టింది. ఏకంగా లోటస్ పాండ్ లోని ఆయన నివాసంపైనే పంజా విసరబోతోంది. అలాగే, జగన్ మీడియాకు కేంద్రమైన సాక్షి టీవీ, పేపర్ల భవనాల్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకోబోతోంది! ఇంకా కొన్ని ఇతర ఆస్తులకి ఈడీ నుంచి మూడినట్టే కనిపిస్తోంది! జగన్ కు చట్టపరమైన కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. కోర్టులో కేసులు ఒకవైపు సతమతం చేస్తోంటే మరో వైపు నుంచి ఈడీ తరుముకొస్తోంది. జగన్ ఆస్తుల్ని అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఈడీ అటాచ్ చేయటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చేసింది. అయితే, హైకోర్ట్ కు వెళ్లి ఆయన స్టే తెచ్చుకున్నారు. కాని, ఇప్పుడు స్టే ఎత్తివేయటంతో అటాచ్ మెంట్ల భూకంపం కుదిపేస్తోంది. పైకి గంభీరంగానే కనిపిస్తున్నా జగన్ శిబిరంలో టెన్షన్ బాగానే వుంది. కేవలం పది రోజులు టైం ఇచ్చిన ఈడీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం కష్టంగా మార్చేసింది. సాధారణంగా 45 రోజులు గడువు ఇవ్వాలి. కాని, జగన్ పై అభియోగాలు తీవ్రంగా వుండటంతో పది రోజులే అవకాశం ఇచ్చింది ఈడీ. ఇప్పుడు పది రోజుల్లో ప్రతిపక్ష నేత సుప్రీమ్ దాకా వెళ్లైనా ఆస్తుల్ని కాపాడుకోవాలి. లేదంటే తీర్పు వచ్చే వరకూ ఆయన ఆయా ఆస్తుల పై ఆశలు వదులుకుని మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది! జయ, శశికళ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంది కేవలం అరవై ఆరు కోట్లకు సంబంధించే. అయినా పురుచ్చితలైవీ సీఎం పదవి వదులుకోవాల్సి వచ్చింది. శశికళ సీఎం కుర్చీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతోంది! మరి జగన్ అంతకు పది రెట్లు ఎక్కువ మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టారని కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మరి ఈ చట్టపరమైన కందకాలు దాటుకుని .... సీఎం అవుతానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్న జగన్ ఎప్పుడు అమరావతి సింహాసనం అధిష్ఠిస్తాడో... చూడాలి మరి!
ఆ మధ్య ప్రత్యేక హోదా కోసం వైజాగ్ బీచ్ లో ఉద్యమం అంటే జగన్ రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయారు! కాని, పోలీసులు అడ్డుకోవటంతో ఆగ్రహంతో ఊగిపోయారు! అప్పుడు ఏమన్నారు? నెక్స్ట్ సీఎం నేనే... అందర్నీ గుర్తుపెట్టుకుంటా అని హెచ్చరించారు! కాని, పరిస్థితి చూస్తుంటే జగన్ ఎంత మంది పోలీసు అధికారుల్ని గట్టిగా గుర్తు పెట్టుకున్నా ఆయన సీఎం అవ్వటం అనుమానంగానే కనిపిస్తోంది. అందుకు కారణం... ప్రస్తుతం తమిళనాడు సీఎం అవ్వాలని శాయశక్తులా ప్రయత్నిస్తోన్న శశికళ పరిస్థితే!
http://www.teluguone.com/news/content/jagan-45-72046.html





