భార్యపైన తనకున్న ప్రేమను చాటుకున్న ఓ రైతు
Publish Date:Dec 19, 2025
Advertisement
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 89 ఏళ్ల వయసులోనూ తన జీవిత సహచరిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ ఓ రైతు తన భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. కళ్లెం నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులు... వీరు చిలుకూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం క్రితం భార్య లక్ష్మి మరణించింది. దీంతో భార్య లక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా కళ్లెం నర్సింహా రెడ్డి, తన వ్యవసాయ క్షేత్రంలో భార్య లక్ష్మీ విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూతుళ్లు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం ఆమె పక్కనే తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ముప్పై సంవత్సరాల పాటు అమెరికాలో వ్యవసాయం చేస్తూ ఆధునిక, ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అమలు చేసిన నర్సింహా రెడ్డి, ఆ కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా అవార్డును కూడా అందు కున్నారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన చిలుకూరులో స్థిరపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న భార్య లక్ష్మీ మరణించడంతో నర్సింహా రెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు. అయితే ఆమె జ్ఞాపకాలను మరచి పోకుండా ఉండేందుకు, జీవితాంతం తనతోనే ఆమె ఉంటుందనే భావనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. “ఆమె ఒంటరిగా ఉండ కూడదు… నేను ఆమెకు తోడుగా ఉంటాను” అన్న భావంతోనే భార్య పక్కనే తన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు. జీవిత భాగస్వామి పై నిస్వార్థమైన అనురా గాన్ని చూపిస్తున్న రైతును చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు.చిలుకూరులో జరిగిన ఈ ఘటన, ప్రేమకు వయస్సుతో పని లేదని మరోసారి నిరూపించింది.
http://www.teluguone.com/news/content/ranga-reddy-district-36-211285.html





