తమిళనాట కొత్త పార్టీ లేనట్టేనా ? రజనీ అనారోగ్యంపై కొత్త చర్చ ?
Publish Date:Dec 26, 2020
Advertisement
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏమైంది? ఆయన హై బీపీతోనే బాధపడుతున్నారా లేక ఇంకేమైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? డిసెంబర్ 31న రజనీ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా.. ఉండదా?.. ఇదే ఇప్పుడు రజనీకాంత్ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. తమిళనాడు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని చెప్పిన రజనీకాంత్.. అందుకు కసరత్తు కూడా చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాట్లు చూస్తూనే రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రజనీకాంత్.. ఒక్కసారిగా అనారోగ్యానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. దీంతో భాషా హెల్త్ కండీషన్ పై ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నా... అభిమానుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. 2017 డిసెంబర్ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు. రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్. మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ లో చేరడంతో పార్టీ ఏర్పాటుపై మళ్లీ అయోమయం నెలకొంది. రాజకీయ పార్టీపై రజనీకాంత్ వెనక్కి తగ్గారని గతంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్.. అది తన ప్రకటన కాదంటూనే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను పరోక్షంగానే అంగీకరించారు. మండ్రం నిర్వాహకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. గతంలో ప్రచారం జరిగినట్లే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పుడు కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. అరోగ్య కారణాల రీత్యా పార్టీ ఏర్పాటుకు రజనీకాంత్ కు మంచి కాదని వైద్యులు గతంలో సూచించారని, వాళ్లు చెప్పినట్లే జరుగుతున్నందున.. రాజకీయ పార్టీపై రజనీకాంత్ పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ గమనం ఉంటుందా ఉండదా అన్న అనుమానాలే ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా జరుగుతున్నాయి.
రజనీ కాంత్ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం కంటే మరింత మెరుగుపడిందన్న అపోలో డాక్టర్లు.. మరిన్ని వైద్య పరీక్షలు చేశామని తెలిపారు. రజనీకాంత్ ను పరామర్శించేందుకు ఎవ్వరూ రావద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. దీంతో రజనీ పరామర్శకు ఎవరూ రావొద్దని వైద్యులు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీ ప్రకటన వాయిదా వేయడానికే రజనీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే వాదనలు కొందరి నుంచి వస్తున్నాయి. గతంలోనూ కొందరు రాజకీయ నేతల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ మార్పు సందర్భాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఏపీ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు
వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు కన్నా లక్ష్మినారాయణ . తెల్లారితే కన్నా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాల్సి ఉండగా.. బీజేపీ పెద్దలు ఎంట్రీ అయ్యారు. కన్నాను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతలోనే వైసీపీలో చేరడానికి అన్ని సిద్దం చేసుకున్న కన్నా లక్ష్మినారాయణ.. అర్ధరాత్రి పూట సడెన్ గా అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. మరికొన్ని గంటల్లో వైసీపీలో చేరాల్సి ఉన్న కన్నా.. అది తప్పించుకోవడానికే హాస్పిటల్ లో చేరారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో అలానే జరుగుతుందనే చర్చ కొందరి నుంచి వస్తోంది.
http://www.teluguone.com/news/content/rajinikanth-party-will-come-or-not-39-108155.html





