చీరాలలో మంత్రి సాక్షిగా ఉప్పు నిప్పు కలిసాయి..
Publish Date:Dec 26, 2020
Advertisement
ఏపీ సీఎం జగన్ ను నిత్యం చికాకులతో సతాయించే నియోజకవర్గాలు రెండు. అందులో ఒకటి కృష్ణాజిల్లా గన్నవరం కాగా రెండోది ప్రకాశం జిల్లా చీరాల. ఈ రెండు చోట్ల టీడీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొట్టడంతో వైసీపీ పార్టీలో నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. చీరాలలో ఎటువంటి కార్యక్రమం జరిగినా అటు కరణం బలరాం వర్గం, ఇటు ఆమంచి కృష్ణమోహన్ వర్గం కాలు దువ్వుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నిన్న చీరాలలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు మంత్రితో ఒకే వేదిక ను పంచుకోవడం హాట్ టాపిక్ అయింది. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి బాలినేనికి ఓ వైపు కరణం బలరాం.. మరోవైపు ఆమంచి నిలబడి ఉండగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రోగ్రాం పూర్తి కావడం విశేషం. కొద్దిరోజుల క్రితం చీరాలలో మత్స్యకారుల మధ్య నెలకొన్న గొడవల్లో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకం కావడంతో మంత్రి బాలినేని స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో ఇద్దరు నేతల అనుచరులు వస్తే మళ్లీ ఘర్షణలు జరుగుతాయని భావించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా కేవలం ఆమంచి, కరణంలను మాత్రమే వేదికపైకి అనుమతించారు. అయితే ఒకరిపై మరొకరు లోపల రగిలిపోతున్నా.. ఆమంచి, కరణం మాత్రం పైకి నవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. అయితే వేదికపై వారిద్దరూ పలకరించుకోకుండా ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఇద్దరునేతల అనుచరులను పోలీసులు అనుమతించకపోకడంతో.. ఎటువంటి ఘర్షణలు లేకుండా కార్యక్రమం ముగియడంతో ఇటు వైసీపీ కార్యకర్తలు, అటు అధికారులు కూడా ఉపిరి పీల్చుకున్నారు.
http://www.teluguone.com/news/content/karanam-and-amanchi-on-same-stage-39-108153.html





