వీళ్ళు నాయకులా.. ఇంజనీర్లా?
Publish Date:Jul 15, 2014
Advertisement
దేశంలోని సివిల్ ఇంజనీర్లు, డ్యామ్‌ల నిర్మాణ నిపుణులు కూడబలుక్కుని అర్జెంటుగా రాజకీయ నాయకుల దగ్గరకి వచ్చేసి, వాళ్ళదగ్గర ఇంజనీరింగ్ పాఠాలు నేర్చుకుంటే మంచింది. ఎందుకంటే ఇంజనీర్లకే పాఠాలు నేర్పించే స్థాయికి మన రాజకీయ నాయకులు ఎదిగిపోయారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును దశాబ్దాలుగా కార్యరూపం దాల్చకుండా చేసిన రాజకీయ నాయకులు ఇప్పుడు కీలక దశలో కూడా, పోలవరం కల నిజమవుతున్న శుభవేళ కూడా మోకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి నాయకుల కుట్రలన్నిటినీ దాటుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అవరోధాలూ తొలగిపోయాయి. పోలవరం ముంపు గ్రామాల బిల్లుకు సంబంధించిన చర్చ రాజ్యసభలో జరుగుతున్న వేళ పలువురు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పోలవరం ప్రాజెక్టు వల్ల గిరిజనులకు అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెట్టారు. తమకు మాత్రమే గిరిజనుల మీద ప్రేమ వున్నట్టు, ఆ ప్రేమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేనట్టు తెగ బాధపడిపోయారు. ఈ గోల ఇలా వుంటే, పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి పాత తుప్పు పట్టిపోయిన ఆయుధాన్ని కూడా బయటకి తీశారు. అది పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలి. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులతోపాటు కమ్యూనిస్టులు కూడా పోలవరం డిజైన్‌ని మార్చాలని, ఇప్పుడున్న డిజైన్ మంచిది కాదని నోటికొచ్చినట్టు చెప్పేశారు. అంటే ఈ రాజకీయ నాయకుల ఉద్దేశమేంటి? పోలవరం ప్రాజెక్టు డిజైన్‌కి రూపకల్పన చేసిన ఇంజనీర్లకు ఏమీ తెలియదనా? ఆ ఇంజనీర్లందరూ ఇంజనీరింగ్ పాఠాలు ఈ రాజకీయ నాయకుల దగ్గర్నుంచి నేర్చుకోవాలనా? ఆంధ్రప్రదేశ్‌కి ఏదైనా మేలు జరిగితే తట్టుకోలేక ఏవేవో కాకమ్మ కథలు చెబుతూ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించడం ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పటికైనా మానుకోవాలి.
http://www.teluguone.com/news/content/polavaram-project-design-45-35914.html





