రామ్‌గోపాల్ వర్మ.. ఏమిటీ ఖర్మ?
Publish Date:Jul 15, 2014
Advertisement
అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు... అని ఓ పద్యంలో చెప్పినట్టుగా అసలు ఫీలింగ్స్ అనేవే లేని, బాధపడటం అనేది బాడీలోనే లేని రామ్ గోపాల్ వర్మ కూడా ఈమధ్య తెగ ఫీలైపోయాడు. ఓ తెగ బాధపడిపోయాడు. ఇంతకీ ఆయన బాధ ఎవరిమీద అంటే, తాను తీసే తలాతోకా లేని సినిమాలను కష్టపడి చూసి రివ్యూలు రాసేవాళ్ళమీద. ఇంతకాలం ఆయన తీసే సినిమాలు ఎంత చెత్తగా వున్నాయని రాసినా లైట్‌గా తీసుకునే రాము ఇప్పుడు తన మీద, తన సినిమాల మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేని స్థితికి చేరుకున్నట్టున్నాడు. ఎందుకంటే, వయసు మీదపడుతోంది కదా! వర్మ ఈ మధ్య ‘ఐస్ క్రీమ్’ అనే పరమ వీర బీభత్స కళాఖండాన్ని తీశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్లలో నుంచి బతుకుజీవుడా అనుకుంటూ బయటకి వస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి కళాఖండాన్ని చూసిన సినీ విశ్లేషకులు తమ రివ్యూలలో ఈ సినిమాని విమర్శించి ఖండఖండాలు చేశారు. ఇలాంటి విమర్శలు కూడా పబ్లిసిటీగా భావించే వర్మ ఆయన బుర్రలో ఏ వర్మ్ పుట్టిందోగానీ సడెన్‌గా రియాక్ట్ అయ్యారు. తన సినిమాని విమర్శిస్తూ రివ్యూ చేసిన వాళ్ళని ‘కుక్క’లతో పోలుస్తూ ఫేస్‌బుక్‌లో అచ్చ తెలుగులో మేటర్ పోస్టు చేశాడు. ఆ మేటర్లో వర్మ వాడిన భాష, ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, తనది ఆవేదన కాదు చిరాకు అని వర్మ ఇచ్చిన క్లారిఫికేషన్, మేటర్ నిండా బోలెడంత వర్మ అహంకారం.. ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఆ బహిరంగ లేఖలో వర్మ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మద్దతు పలికిన వారు వన్ పర్సెంట్ వుంటే, మిగతా 99 పర్సెంట్ వర్శని తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. తన సినిమాల మీద వచ్చిన రివ్యూలని లైట్‌గా తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఫేస్ బుక్‌లో బహిరంగ లేఖ రాయడం వల్ల వర్మని బోలెడంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాంతో ఇప్పుడు వర్మ పరిస్థితి అడిగి మరీ తిట్టించుకున్నట్టుగా తయారైంది. వర్మకి ఎందుకీ ఖర్మ?
http://www.teluguone.com/news/content/ram-gopal-varma-ice-cream-45-35913.html





