పవన్ ఏంటో... కాకినాడ సభ క్లారిటీ ఇచ్చిందా?
Publish Date:Sep 10, 2016
Advertisement
పవన్ కళ్యాణ్... ఈ పేరు సినిమా ప్రపంచంలో సంచలనం! మెగాస్టార్ తరువాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న విలక్షణ స్టార్ పవన్ కళ్యాణ్. అదే ఆయన రాజకీయాల్లోకి వస్తే కూడా కలకలానికి కారణమైంది. ప్రజారాజ్యం టైంలో యువరాజ్యం నాయకుడిగా పవన్ కళ్యాణ్ బాగానే వేడి రాజేశాడు. ఆయన అప్పట్లో అన్న పంచెలు ఊడదీసే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే! ప్రజారాజ్యం కాంగ్రెస్ లో అస్తమించటం , చిరంజీవి అదే పార్టీలో హస్తమించటం మనకు తెలిసిందే. కాని, ఎంజీఆర్, ఎన్డీఆర్ ల కాలం చెల్లిపోయిందనీ, ఇప్పుడు సినిమా వాళ్లు సీఎంలు అయ్యే ఛాన్స్ లు దాదాపు లేవని మాత్రం ఆయన నిరూపించారు. మెగాస్టార్ గా మొదలై కేంద్ర మంత్రిగా పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించారు. పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పకున్నా ప్రస్తుతం 150వ సినిమా చేస్తూ అచ్చొచ్చిన యాక్టింగ్ తిరిగి ప్రారంభించారు! అన్నయ్య కథ ఎక్కడో మొదలై ఎక్కడో ఆగితే తమ్ముడు పవన్ కళ్యాణ్ తన కథని ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడెక్కడికో తీసుకెళుతున్నాడు. ప్రజారాజ్యం ఎపిసోడ్ తరువాత చాన్నాళ్లు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ జనసేన అంటూ 2014 ఎన్నికల ముందు మన గబ్బర్ సింగ్ ప్రత్యక్షమయ్యాడు. తన పార్టీ వున్నా అభ్యర్థుల్ని రంగంలోకి దింపకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికాడు. ఇక్కడ నుంచే పవన్ రాజకీయ అపరిపక్వత కనిపిస్తూ వస్తోంది! కమ్యూనిస్ట్ అయిన చేగువేరా నుంచి ప్రేరణ పొందుతూ బీజేపి లాంటి సంప్రదాయవాద పార్టీతో జతకట్టడం ఆయన లాజిక్కే అందే విషయం. అంతే కాదు, మోదీ, బాబులకు అదికారం ఇప్పించి మరోసారి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు! ఎన్నికల తరువాత తన మానానా తాను సినిమాలు చేసుకుని ప్రశ్నించటం ఏమైంది అంటే సమాధానం ఇవ్వలేదు పవన్. కాని, రెండున్నర ఏళ్ల తరువాత భారీ స్థాయిలో జనం ముందుకు వచ్చేశాడు. అప్పుడప్పుడూ రాజధాని రైతుల బాగోగుల గురించి మాట్లాడినా మొన్నటి తిరుపతి సభ సమయంలోనే మళ్లీ ఫుల్ టైం గా జనం ముందుకొచ్చాడు జనసేనాని! పవర్ స్టార్ కాకినాడ సభ కంటే ముందే కేంద్రం తనకు వీలున్నంత లాభదాయకమైన ప్యాకేజ్ ప్రకటించేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష వైసీపీ హోదానే కావాలంటూ అసెంబ్లీలో , బయట రచ్చ చేస్తోంది. ఇందరి మధ్యా పవన్ మరోసారి హోదా కావాల్సిందేనని అన్నాడు. బీజేపిని బాగా టార్గెట్ చేశాడు. కాని, టీడీపీ పట్ల కాస్త మెతకగా వున్నట్టు కనబడ్డాడు. అదంతా పక్కన పెడితే ఏవో రెండు పాచిపోయిన లడ్డూలు అన్నాడు. అవేంటో చివరిదాకా చెప్పలేదు. ఇక సభ ప్రారంభంలోనే ఏ దేశమేగినా అంటూ పాట పాడి... అది గురజాడ రాశాడంటూ తప్పుగా చెప్పాడు. దాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. ఇలా ఎంత మాత్రం ప్లానింగ్, ప్రిపరేషన్ లేకుండా పవన్ కాకినాడ వ్యవహారం కానిచ్చేశాడు! అవంతీ శ్రీనివాస్ ను రాజీనామ చేయమనటం మొదలు టీజీ వెంకటేష్ ను విమర్శించటం వరకూ ఏ దిక్కు, దిశా లేకుండా సాగింది పవన్ ఉపన్యాసం. గొంతు చించుకుని అరుస్తూ పవన్ ఎంతగా పంచ్ డైలాగ్స్ వేసినా కాకినాడ సభలో అసలు పాయింట్ మిస్సైపోయింది. కనీసం ప్రత్యేక హోదా కోసం జరిగే బంద్ లో పాల్గొనాలా వద్దా వంటి విషయం కూడా క్లియర్ గా చెప్పలేదు పవన్ కళ్యాణ్. మూడు దశల్లో పోరాటం కూడా చర్చలోకి రాలేదు. తరువాతి సభ ఎక్కడా అన్నది ఎవ్వరికీ తెలియదు! సభ అనంతరం ఒక అభిమాని చనిపోవటంతో ఇక మీదట తాను సభలు పెట్టనని పవన్ అన్నట్టు సమాచారం. అదే నిజమైతే పవన్ అస్థిమితమైన నిర్ణయాలకి ఇది మరో తార్కాణం. రెండు సభలు ఆవేశంగా పెట్టేసి ఇక మీదట అలాంటివి వుండవు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రస్తుతానికి సస్పెన్స్! అంతేనా? ఇలా అయితే, జనం సమస్యలు తీరేదెప్పుడు, వాటి కోసం జనసేన, జనసేనాని పోరాడేదెప్పుడు? ఏ పద్ధతిలో పోరాటం నడుస్తుంది? కాకినాడ సభతో పవన్ చాలా వరకూ తనని నమ్ముకున్న వారికి భ్రమలు తొలిగించాడు. కలగాపులంగా స్పీచ్ ఇచ్చి ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఉధృతంగా దూసుకొస్తాడన్న ఆశల్ని ఆవిరి చేశాడు! ముందు ముందు మరీ అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప పవన్ రాజకీయంగా కింగో, కింగ్ మేకరో అవ్వటం కష్టం...
అసలు ఒక అభిమాని చనిపోతే వెళ్లి అక్కడికక్కడే బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇది కొందరు డైనమిజం అంటుండవచ్చు. కాని, రాజకీయాల్లో ఇలాంటి ఆవేశం మంచిది కాదు. హడావుడిగా సభ పెట్టిన ఆయన ఆ రోజు పెద్దగా ఏం తేల్చకుండానే కాకినాడ సభలో అంతా చెబుతానన్నాడు. మూడు దశల్లో పోరాటం అని కూడా ప్రకటించాడు. అంతా పవన్ క్లారిటీతో వున్నాడనే భావించారు. కొందరైతే జనసేన పార్టీలో తమ బెర్త్ ల కోసం ఖర్ఛీఫులు కూడా రెడీ చేతిలో పట్టుకున్నారు.
రాష్ట్రంలో ప్రధాన సమస్య హోదానే కావచ్చు. కాని, పవన్ ప్రత్యేక హోదాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మిగతా వాట్ని కూడా వాడుకుంటే బావుంటుంది. కాని, కాపుల రిజర్వేషన్ లాంటి కీలకమైన అంశం కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా వుండిపోయాడు పవన్ కళ్యాణ్. అదే కాకినాడ సభలో అందర్నీ నిరాశపరిచింది.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-45-66306.html





