గలాటాకే అయితే... గల్లీలు చాలు... అసెంబ్లీ ఎందుకు?
Publish Date:Sep 10, 2016
Advertisement
చట్ట సభల్లో గొడవలు, ఆందోళనలు మామూలే. అఖరుకి మైక్ లు విరిచేయటాలు, పేపర్లు విసిరేయటాలు కూడా కామన్ అయిపోయాయి. కాని, ఏ రాష్ట్ర చట్టసభలో అయినా హంగామా చెలరేగటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. పార్లమెంట్లో కూడా పేప్పర్ స్ప్రే ఉదంతాలు అడపాదడపా జరుగుతూనే వుంటాయి. కాని, మన ఏపీ అసెంబ్లీ మరీ దారుణంగా తయారైంది. అప్పుడప్పుడు సభలో గందరగోళం కాదు అసలు సభే గందరగోళంగా నడుస్తోంది! తెలంగాణ విభజనతో ఏర్పడ్డ నవ్యాంధ్ర అసెంబ్లీ ఏనాడూ ప్రశాంతంగా ముందుకు పోవటం లేదు. వాయిదాల మీద వాయిదాలు, వివాదాల మీద వివాదాలు... ఇంతే తప్ప ప్రజా సమస్యలు ఎంత మాత్రం పట్టింపులో వుండటం లేదు. మరో వైపు తెలంగాణ అసెంబ్లీ ఎంతో కొంత హుందాగా నడుస్తోంది. అక్కడా వెల్ లోకి వెళ్లటం లాంటివి జరుగుతూనే వున్నా ఆంధ్రా శాసన సభంత దయనీయంగా వుండటం లేదు! దీనికి కారణం ఏంటి? కేవలం తెలంగాణతో పోల్చుకోవటం కాదు అసలు మొత్తం దేశంలోనే మన ఆంధ్రా చట్టసభలంత గందరగోళంగా మరేక్కడ జరగటం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షమనే చెప్పాలి. అధికార పక్షానిది ఎలాంటి తప్పు లేదని ఏ ఒక్కరూ అనలేరు. కాని, టీడీపీ ప్రభుత్వం కాస్త ఆధిపత్యం చెలాయించినా ప్రజా సంక్షేమం కోసం ఓపిక పట్టాల్సిన ప్రతిపక్షం అంతకంతకూ మొండికేస్తోంది. లోపల స్పీకర్ సమక్షంలో, బయట మీడియా సమక్షంలో రెండు చోట్లా వైసీపీ ఎమ్మేల్యేలు నిప్పు తొక్కినట్లు చిందులేస్తున్నారు. పోని ఇదంతా జనం బాగు కోసమా అంటే అదేం కాదు. ప్రభుత్వం ప్రతి పక్షం కోరినట్టు చర్చ చేపట్టినా ఎవ్వరూ పెద్దగా గవర్నమెంట్ ను బోనులో నిలబెట్టింది ఏమీ వుండటం లేదు. ప్రతీసారి చర్చ జరిగినప్పుడు ఆంధ్రా అసెంబ్లీలో వినిపించే ఆరోపణ జగన్ కు తగినంత టైం ఇవ్వలేదు అని! కాదంటే అసలు మైకే ఇవ్వలేదని! ప్రతిపక్షం నేతలు సభలో కూడా బహిరంగ సభల్లో మాట్లాడినట్టు తమకు తోచినంత సేపు మాట్లాడితే ఏ స్పీకర్ అయినా చర్యలు తీసుకోక తప్పదు. అప్పుడు ఇక ఆయన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు మన ప్రతిపక్షం వారు! ఆయన పక్షపాతం వహిస్తున్నారని రొటీన్ గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాని, తాము , తమ ప్రవర్తన ఎలా వుంటుందో విశ్లేషించుకోవటం లేదు! అధికార పక్షంలో కూడా కొందరు నోటి దురుసు నేతలు వుండొచ్చు. కాని, ప్రతిపక్ష నేతలు పదే పదే ఉన్మాద చర్యలకు పాల్పడటం క్షమించరానిది. జనం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేయాలిగాని... చంద్రబాబు వర్గాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా అరుపులు, కేకలు, విపరీత చేష్టలు, సైగలు... వీటి వల్ల అపోజిషన్ కే నష్టం! ఇతర రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ప్రతిపక్షం ఎలా పని చేస్తుందో కాస్త గమనిస్తే ఎంతో మంచిది. లేకపోతే ఇప్పుడు సంవత్సరం పాటూ, నెలల పాటూ సస్పెండ్ అవ్వటమే కాక వచ్చే ఎన్నికల్లో జనం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది! అప్పుడు అధికార పక్షం మమ్మల్ని సభలో మాట్లాడనీయలేదు అంటే ప్రజలు హర్షించరు. ప్రతిపక్ష ఎమ్మేల్యేలుగా మీరెంత కృషి చేశారు అన్నదే ఆలోచిస్తారు!
http://www.teluguone.com/news/content/ap-assembly-45-66301.html





