కవిత అంటే కాషాయదళానికి ఎందుకంత కోపం?
Publish Date:Sep 11, 2016
Advertisement
కల్వకుంట్ల కవిత... కేవలం కేసీఆర్ కూతురిగా మాత్రమే కాదు... నిజామాబాద్ ఎంపీగా కూడా ఇప్పుడు ఢిల్లీలో ఫుల్ ఫేమస్! పార్లమెంట్ లో ఆమె వీలున్నప్పుడల్లా తన వాక్ చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడే కాదు కవిత ఎప్పట్నుంచో పొలిటికల్లీ యాక్టివ్. ఉద్యమ సమయంలో కూడా ఆమె కేసీఆర్ కూతురిగా ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలకి పరిమితం కాలేదు. జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మ ఉత్సవాలు జరిపిస్తూ ఉధృతంగా జనంలోకి వెళ్లారు. అందుకే, ఎన్నికల్లో అవలీలగా ఎంపీ స్థానం కైవసం చేసుకున్నారు!
కవిత గురించి మాట్లాడుతుంటే పెద్దగా నెగటివ్ పాయింట్స్ ఏం వుండవు చెప్పకోటానికి. కాని, అలాంటి యంగ్ అండ్ డైనమిక్ నేతని చూసి తెలంగాణ బీజేపి రగిలిపోతందని కొందరి టాక్! ఎందుకు అంటారా? అందుక్కారణం కూడా బీజేపియే! అవును... కేంద్ర బీజేపీ కవితకు ఇస్తోన్న ఇంపార్టెన్స్ చూసి రాష్ట్ర కాషాయదళం కస్సుమంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.... కల్వకుంట్ల కవితకు జాగృతి అనే ఓ స్వచ్ఛంద సంస్థ వున్నమాట అందరికీ తెలిసిందే. దాని ఆధ్వర్యంలోనే యేటేటా బతుకమ్మ సంబరాలు నిర్వహింస్తుంటుంది కవిత! అయితే, తెలంగాణ ఏర్పాటు తరువాత జాగృతి పరిధిని విస్తరించి జనానికి ఉపయోగపడే పనులు చేయిస్తున్నారు నిజామాబాద్ ఎంపీ.
జాగృతి ఆధ్వర్యంలో ఈ మధ్య స్కిల్ డెవలప్ మెంట్ వర్కషాపులు జరిగిన వార్త అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వున్న పదిహేడు జాగృతి సెంటర్స్ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేశారు కూడా! ఇది నిజంగా సంతోషకరమైన విషయమే! కాని, దీని వల్లే తెలంగాణ బీజేపి అసంతృప్తికి లోనవుతోంది! ఎందుకంటే, మొత్తమంతా జాగృతి సంస్థ తన స్వంత డబ్బులతో చేస్తున్నట్టుగా వున్న స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారమంతా కేంద్రం నిధులతో నడుస్తోంది కాబట్టి! మోదీ సర్కార్ మొదలు పెట్టిన కుశల్ వికాస యోజన కింద జాగృతికి భారీగా నిధులు వస్తున్నాయి. వాట్ని ఉపయోగించి కవిత చాలా మందికి రకరకాల నైపుణ్యాల్లో శిక్షణ ఇస్పిస్తున్నారు. కాని, ఇదంతా జరుగుతోంది మోదీ సర్కార్ డబ్బులతో అని మాత్రం ఎక్కడా ప్రచారం జరగటం లేదట. జాగృతి సంస్థ శిక్షణ ఇప్పిస్తుండటంతో జనమంతా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత భావిస్తున్నారట! ఇదే తెలంగాణ బీజేపి నేతల ఆవేదన!
ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ గొప్పతనంగా ప్రకటించుకోవటం, ప్రచారం చేసుకోవటం ఎప్పుడూ జరిగేదే! కాని, ఈసారి కాస్త విచిత్రంగా జాగృతి లాంటి ఎన్జీవో రంగంలోకి దిగి టీఆర్ఎస్ కి మేలు చేస్తోంది. జాగృతిలో కేంద్రం డబ్బులతో శిక్షణ పొందిన వారంతా చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు, అభిమానులు, జాగృతి కార్యకర్తలు అవుతున్నారు! ఇది కొంత వరకూ బీజేపి ఆలోచించుకోవాల్సిన విషయమే! జాగృతితో పాటూ బీజేపికి , సంఘ్ పరివార్ కు దగ్గరగా వున్న ఎన్జీవోలకు కూడా ఈ కుశల్ వికాస్ యోజన కింద నిధులిస్తే 2019లో ఫలితాలు మరింత బాగా వుండొచ్చు. అలాగే, రాష్ట్ర బీజేపి కూడా కాస్త ఉత్సాహంగా పని చేసే ఛాన్స్ వుంటుంది.
ముందు ముందు పొత్తుల రాజకీయంలో టీఆర్ఎస్ తో ఎలాంటి ఉపయోగం వుంటుందో అన్న భావంతో కూడా కేంద్రం కవిత నడిపే జాగృతికి ఇలా ప్రొత్సాహం అందిస్తోందని కూడా కొందరంటున్నారు. అదీ నిజమే కావొచ్చు. కాని, ఢిల్లీలో అధికారంలో వుండి కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి, బీజేపి అభిమానులకి ఆ పార్టీ మేలు చేసుకోలేకపోతే.... అది ఎప్పటికైనా నష్టమే!
http://www.teluguone.com/news/content/kalvakuntla-chandrashekar-rao-45-66331.html





