అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కిగౌడ్ సతీమణికి గాయాలు
Publish Date:Jun 4, 2026
Advertisement
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ కుమార్తె గగనను ఉన్నత చదువుల నిమిత్తం కాలేజీలో జాయిన్ చేసేందుకు అమెరికా వెళ్లారు. కూతురి అడ్మిషన్ ప్రక్రియ ముగించుకుని వారు బోస్టన్ నగరం నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మార్గమధ్యంలో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపైనే పలు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మధుయాష్కీ భార్య డాక్టర్ సుచీ యాష్కీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పక్కటెముకలు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా మధుయాష్కి గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. కుమార్తెను ఎండి కోర్సులో జాయిన్ చేసే క్రమంలో లగేజీ ఎక్కువ ఉండటంతో డాక్టర్ సూచియాష్కి, మధుయాష్కిగౌడ్ వేర్వేరు కార్లలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మధు యాష్కిగౌడ్ రేపు ఆయన ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. డాక్టర్ సుచి యాష్కీ ఆరోగ్య పరిస్థితిపై మధుయాష్కీగౌడ్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nizamabad-mps-wife-injured-in-road-accident-36-221752.html





