ఆపరేషన్ కవచ్.. హైదరాబాద్‌లో 562 హోటళ్లలో అర్ధరాత్రి సోదాలు
Publish Date:Jun 6, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో ఉన్న మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లలో బస చేస్తున్న అతిథుల వివరాలు, గుర్తింపు కార్డులు, రిజిస్టర్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అతిథుల పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆపరేషన్‌ను సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను సందర్శించిన ఆయన, గదుల కేటాయింపు విధానం, సందర్శకుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అక్కడ బస చేస్తున్న కొందరు అతిథులతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, నగరానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి వంటి వివరాలను తెలుసుకున్నారు. జోన్ల వారీగా పరిశీలిస్తే ఖైరతాబాద్ జోన్‌లో అత్యధికంగా 119 హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించగా, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్ మరియు గోల్కొండ జోన్లలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్‌లో 44 చోట్ల సోదాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, ప్రత్యేక విభాగాల పోలీసులు సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ హోటల్, లాడ్జీ నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అతిథి నుంచి తప్పనిసరిగా అసలు గుర్తింపు కార్డును పరిశీలించి, దాని స్పష్టమైన ప్రతిని భద్రపరచాలని ఆదేశించారు. రిజిస్టర్లలో పూర్తి వివరాలు, మొబైల్ నంబర్లు, చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు కేటాయించరాదని హెచ్చరించారు. అలాగే మైనర్లకు గదులు ఇవ్వకూడదని, వారి వయస్సును గుర్తింపు పత్రాల ద్వారా ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. హోటళ్లలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, రిసెప్షన్ ప్రాంతాలను కవర్ చేసే విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా త్వరలో డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా నగరంలో నేర కార్యకలాపాలను అరికట్టడంతో పాటు హోటల్ రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయడమే ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/operation-kavach-36-222121.html





