తెలంగాణలోకి కొత్త కరోనా వైరస్ ? టిమ్స్ లో స్పెషల్ ఐసోలేషన్
Publish Date:Dec 25, 2020
Advertisement
బ్రిటన్ ను వణికిస్తున్న కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ తెలంగాణలోకి ఎంటరైందని వైద్య ఆరోగ్య శాఖ అనుమానిస్తోంది. అమెరికా నుంచి లండన్ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళకు ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నిర్దారణ అయింది. అయితే ఆ మహిళకు ఇండియాకు వచ్చే ముందే వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలియడంతో .. ఆమెకు కొత్త స్ట్రెయిన్ సోకి ఉండొచ్చన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్ స్పెషల్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ పాపను కూడా తల్లితోపాటు టిమ్స్‌లో ఉంచారు. ఆమె భర్తను హైదరాబాద్‌లోని ఇంట్లో, నల్గొండలో ఉంటున్న ఆమె అత్త, మామలను అక్కడే క్వారంటైన్ చేశారు. వాళ్లందరి శాంపిల్స్‌ను టెస్టుల కోసం పంపారు ఆరోగ్య శాఖ అధికారులు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ కు చెందిన ఆ మహిళ.. ఈ నెల 19న అమెరికా నుంచి లండన్ మీదుగా హైదరాబాద్‌కు వచ్చారు. కొత్తపేటలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఆమెను వైద్య శాఖ అధికారులు గుర్తించి గురువారం రాత్రి టెస్టులు చేయించారు. తనకు లండ్ నుంచి వస్తున్నప్పుడే వైరస్ సింప్టమ్స్ కనిపించాయని.. అందుకే బోడుప్పల్‌లోని తమ ఇంటికి వెళ్లకుండా, కొత్తపేటలో తెలిసిన వాళ్ల అపార్ట్ మెంట్లో ఓ ఫ్లాట్ తీసుకుని ఐసోలేషన్ లో ఉంటున్నానని ఆమె అధికారులకు చెప్పినట్టు తెలిసింది. భర్త, రెండేండ్ల పాపతో కలిసి ఆమె అమెరికా నుంచి లండన్ మీదుగా వచ్చిందని.. ఫ్లైట్ మారేందుకు లండన్ ఎయిర్‌పోర్టులో రెండున్నర గంటల పాటు వెయిట్ చేసిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆమెకు కరోనా కొత్త స్ట్రెయిన్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. డిసెంబర్ నెలలో బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన మొత్తం 12 వందల మందిలో.. శుక్రవారం సాయంత్రం వరకు 926 మందిని అధికారులు ట్రేస్ చేయగలిగారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం పంపారు. ఆరొందల మంది టెస్టు రిజల్ట్స్ రాగా.. వారిలో గురువారం 8 మందికి పాజిటివ్ రాగా.. శుక్రవారం మరో 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 16 మందిలో హైదరాబాద్ వాళ్లు నలుగురు, మేడ్చల్ జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు.. మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. హైదరాబాద్, మేడ్చల్ వాళ్లను టిమ్స్‌లో, మిగతా వారిని జిల్లాల్లోని హాస్పిటల్స్‌లో ఐసోలేషన్ ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కరోనా సోకిన ఈ 16 మందికి సన్నిహితంగా మెలిగిన 76 మందిని క్వారంటైన్‌లో పెట్టారు.
బ్రిటన్ నుంచి వచ్చినవాళ్లకు సోకింది బ్రిటన్‌లో మ్యూటేటైన వైరసా, వేరే రకమా అన్నది శనివారం రాత్రికి తేలనుంది. యూకే నుంచి వచ్చి కరోనా నిర్దారణ అయిన 16 మంది శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపించామని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరి జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయానికల్లా శాంపిళ్ల రిజల్ట్ వెల్లడించనున్నట్టు సీసీఎంబీ సైంటిస్టులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/new-covid-strian-enter-in-telangana--39-108131.html





