గుజరాత్‌లో మోదీకి గడ్డుకాలం
Publish Date:Aug 6, 2016
Advertisement
2001లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా విధులను చేపట్టిన దగ్గర్నుంచీ ఆయనకు తిరుగులేకుండా పోయింది. 2002లో గోద్రా మారణకాండ సందర్భంగా ఆ రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల తరువాత కూడా ఆయన మరోసారి ముఖ్యమంత్రి పదవిని చూపట్టడంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అంతేకాదు! గుజరాత్‌ను 13 ఏళ్లపాటు సుదీర్ఘంగా ఆ పదవిని చేపట్టి, గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించారంటూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ఆ పేరుతోనే ఏకంగా 2014లో ప్రధానమంత్రి పీఠాన్ని సైతం చేజిక్కించుకున్నారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవేమో! గుజరాత్ నుంచి తాను దిల్లీకి చేరుకున్నా, స్వరాష్ట్రంలో మోదీ హవాకు ఢోకా ఉండదని అందరూ అనుకున్నారు. కానీ రానురానూ గుజరాత్‌లో మోదీకి ఎదురుగాలి వీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మోదీ తరువాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆనందీబెన్ పటేల్, ఏమంత సమర్థవంతంగా పాలించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల నేపథ్యంలోనే ఆమెకు పొగపెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ రుపానీని తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. కానీ ఈ చర్యతో అటు ఆనందీబెన్‌కూ ఇటు పటేల్ వర్గానికీ కూడా అసంతృప్తిని కలిగించినట్లు అయ్యింది. అసలే ప్రత్యేక రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటేల్ వర్గం వారికి, తమ వర్గం నుంచి కాకుండా మరో కులం నుంచి ముఖ్యమంత్రిని నియమించడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. పైగా ఉనాలో ఆవు చర్మాన్ని ఒలుస్తున్నారన్న కారణంతో ఏడుగురు దళితుల మీద జరిగిన దాడితో, అటు దళితులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక అక్కడి ముస్లింల మనసులో గుజరాత్ అల్లర్ల గాయాలు ఎలాగూ పచ్చిగానే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో 2017లో జరగనున్న గుజరాత్ రాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి పరాభవం తప్పదన్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే మోదీ సాహెబ్ రచ్చ గెలిచి ఇంట ఓడినట్లు అవుతుందేమో!
http://www.teluguone.com/news/content/narendra-modi-45-64776.html





