తమిళనాడు బీజేపీ ఖాళీ.. అణ్ణామలై దారిలో కీలక నేతలు?
Publish Date:Jun 6, 2026
Advertisement
తమిళనాడులో బీజేపీ ఖాళీ అయిపోతోందా? రాష్ట్రంలో ఎలాగైనా పట్టు సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న ఆ పార్టీకి అణ్నామలై రాజీనామా ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ తీసిందా. పట్టు సాధించాలన్న ప్రయత్నాలు అటుంచి.. తమిళనాట బీజేపీ ఉనికే ప్రశ్నార్థకమౌతోందా అన్న సందేహాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నడుస్తున్న తమిళనాట జాతీయ పార్టీ బీజేపీ ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక దశలో అయితే రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదుగుతోందా అని కూడా అనిపించింది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలం కావడంతో కమలం పార్టీ నైరాశ్యంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీకి అత్యంత కీలకంగా ఎదిగిన అణ్ణామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే మరింత మంది కీలక నేతలు కూడా నడుస్తున్నారు. ఇదే ఇప్పుడు తమిళనాట బీజేపీ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తోంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా.. సొంతంగా ఒక నూతన రాజకీయ ప్రస్థానాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించారు. 2031 అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని అణ్ణామలై ఈ కొత్త కూటమిని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అణ్ణామలై నిష్క్రమణతో తమిళనాడు బీజేపీలో సంక్షోభం ఆగలేదు. ఆయన వెనుకే పార్టీకి చెందిన మరికొందరు కీలక నేతలు అడుగులు వేస్తున్నారు. తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నాగరాజన్ సైతం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగరాజన్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న దాదాపు 15 మంది నేతలు కూడా బీజేపీని వీడారు. ఈ 15 మంది రాష్ట్ర స్థాయి కార్యవర్గ నేతలు కూడా అణ్ణామలై ప్రారంభించిన సరికొత్త రాజకీయ ఉద్యమంలో చేరారు. ఒకేసారి ఇంతమంది సీనియర్లు చేజారిపోవడంతో రాష్ట్రంలో బీజేపీ దాదాపు ఖాళీ అయిపోయిన పరిస్థితి. తమిళనాడులో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలని భావించిన బీజేపీకి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేల తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆశించిన బీజేపీకి దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్యంగా దెబ్బకొట్టింది. విజయ్ ఎంట్రీతో తమిళ ప్రజల నాడి మారిపోవడమే కాకుండా, బీజేపీకి ఉన్న అరకొర అవకాశాల తలుపులు కూడా పూర్తిగా మూసుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలోని కీలక నేతలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పేయడంతో.. ఇక తమిళనాట కమల వికాసం అశలు ఆవిరైనట్లేనని పరిశీలకులు విశ్లేషిష్తున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-empty-in-tamilnadu-45-222014.html





