భలే మంచి గవర్నర్ గారు
Publish Date:Jul 22, 2015
Advertisement
మొత్తానికి మన గవర్నర్ నరసింహన్ భలే మంచివారు. ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం, అది కూడా ఐదేళ్ళతో ఆగకుండా ఎక్స్‌టెన్షన్ కావడం, అందులోనూ రెండు రాష్ట్రాలకూ ఈయనగారే గవర్నర్ గా వుండటం తెలుగు ప్రజలు చేసుకున్న ఏ పుణ్యఫలమో అనిపిస్తూ వుంటుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్నో విషయాలలో జుట్టూ జుట్టూ పట్టుకుంటున్నా మహానుభావుడు ఉలకరు, పలకరు. తన రాష్ట్రానికి అనేక విషయాలలో అన్యాయం జరుగుతోందని ఏపీ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ఆయన అర్ధ నిమీలిత నేత్రాలతో ప్రశాంతంగా చూస్తారే తప్ప ఏమాత్రం స్పందించరు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను అధికార టీఆర్ఎస్ గుంజుకుందని మొరపెట్టుకున్నా ‘‘ఆ విషయం కోర్టులో వుంది కదా’’ అని ప్రశాంతంగా ఎదురు ప్రశ్నిస్తారు. టీడీపీకి రాజీనామా చేయకుండానే చేసినట్టుగా భ్రమింపజేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి పొందారని ఫిర్యాదు చేయడానికి మంగళవారం నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. అక్కడ టీటీడీపీ సభ్యులతో ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఇంత గొప్ప గవర్నర్ని మనం పొందడం మన అదృష్టం అనిపించడం ఖాయం.
టీటీడీపీ సభ్యులు తలసాని విషయాన్ని ఫిర్యాదు చేసినప్పుడు... తాను ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం లేదన్నట్టుగా ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం కోర్టులో వుంది కదా’’ అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. దానికి టీటీడీపీ సభ్యులు ఆ అంశం వేరు. ఈ అంశం వేరని, అది ఫిరాయింపుల అంశం... ఇది రాజీనామా చేయకుండానే చేసినట్టుగా చెప్పారనే విషయం అని వివరించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఈ అంశానికి సంబంధించిన అనేక సందేహాలను అమాయకంగా వ్యక్తం చేశారు. వాటికి టీటీడీపీ సభ్యులు ఓపిగ్గా వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. రావుల చంద్రశేఖరరెడ్డి అయితే గవర్నర్ అధికారాలు, విధుల గురించి సుదీర్ఘంగా మాట్లాడాల్సి వచ్చింది. హనుమంతుడికి తన శక్తి ఏమిటో తనకే తెలియకపోతే, ఆయన ఎంత శక్తివంతుడో గుర్తు చేసిన చందంగా, గవర్నర్‌కి ఎలాంటి అధికారాలు వుంటాయో టీటీడీపీ సభ్యులు గుర్తు చేయాల్సి వచ్చింది. ఇంత చేసినా గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా గవర్నర్ ఎలా స్పందించారో అలాగే ‘‘చూస్తా’’ అనే స్పందనే ఎదురైంది. గతంలో ఎన్నో అంశాలలో ఆయన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ విషయంలో అయినా స్పందిస్తారని ఆశించడం దురాశ అవుతుందేమో!
http://www.teluguone.com/news/content/governor-narasimhan-45-48517.html





