భూదాన్ భూముల కూల్చివేతపై రాహుల్‌కి కవిత లేఖ
Publish Date:Mar 10, 2026
Advertisement
ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై పేదల ఇళ్ల కూల్చివేత అంశంపై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన కూల్చివేతలపై తక్షణ జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. భూదాన్ భూముల కూల్చివేతపై రాహుల్ గాంధీకి కవిత లేఖ ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల వద్ద భూదాన్ భూములపై నిర్మించుకున్న పేద కుటుంబాల ఇళ్ల కూల్చివేతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కూల్చివేత జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం, అక్కడే బాధితులతో కలిసి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష స్థలం నుంచే ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె తెలిపారు. వెలుగుమట్లలో జరిగిన కూల్చివేతలు కేవలం పరిపాలనా చర్యలు కాదని, వందలాది పేద కుటుంబాల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన ఘటనగా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కసారిగా 600 ఇళ్లను బుల్డోజర్‌లతో కూల్చివేయడంతో దాదాపు 2,000 మంది ప్రజలు రాత్రికి రాత్రే నిరాశ్రయులయ్యారని కవిత పేర్కొన్నారు. ప్రభావిత కుటుంబాల్లో చాలా మంది సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు చెందిన వారని, వారు సంవత్సరాలుగా ఆ భూముల్లో నివసిస్తున్నారని ఆమె చెప్పారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు జారీ చేసిన పట్టాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇళ్లను నేలమట్టం చేసిందని ఆరోపించారు. కూల్చివేతలకు ముందు తగినంత నోటీసు ఇవ్వలేదని, కుటుంబాలు తమ సామాన్లు, జీవితకాల పొదుపులను కూడా రక్షించుకునే అవకాశం లేకుండా పోయిందని బాధితులు చెబుతున్నారని ఆమె వివరించారు. ప్రస్తుతం మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర కష్టాల్లో ఆరుబయట జీవిస్తున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉండాల్సిన పిల్లలు ఆహారం, ఆశ్రయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సంవత్సరాల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు దాతృత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఇంత పెద్ద మానవతా సంక్షోభం నెలకొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మౌనం పాటించడం ఆందోళనకరమని కవిత అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పేదలను రక్షించడం, బుల్డోజర్ రాజకీయాలను వ్యతిరేకించడం గురించి కాంగ్రెస్ తరచూ మాట్లాడుతుందని, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే వందలాది పేద కుటుంబాలను వీధుల్లోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు తమ హక్కులు, గౌరవం రక్షించబడతాయని నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని, అయితే ఇప్పుడు పేద కుటుంబాలు ఎటువంటి కరుణ, సంభాషణ లేకుండా స్థానభ్రంశం చెందుతున్న దుస్థితిని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలందరికీ న్యాయం జరిగేలా చూడాలని రాహుల్ గాంధీని కవిత కోరారు. స్థానభ్రంశం చెందిన ప్రాంతంలోనే వారికి ప్లాట్లు కేటాయించి ఇళ్ల మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా నిరాశ్రయులైన కుటుం బాలకు న్యాయం జరిగే వరకు తాను బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు గౌరవంతో కూడిన నివాసాన్ని కల్పించే వరకు ఈ నిరసన కొనసాగుతుందని ఆమె వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/kavitha-letter-to-rahul-gandhi-on-the-demolition-of-bhoodan-lands-36-215297.html





