జగన్ దీక్షలు ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయిట!
Publish Date:Sep 12, 2015
Advertisement
ఏ రాష్ట్రంలోనయినా ప్రతిపక్షాలు ఏదో ఒక అంశంపై ప్రభుత్వ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ పోరాడటం సహజమే. కానీ అందుకోసం రాజకీయ పార్టీలు తరచు నిరాహార దీక్షలు చేయవు. కానీ ఆంద్రప్రదేశ్ లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సగటున నెలకొకసారి ఏదో ఒక అంశం పేరుతో నిరాహార దీక్షలు, ఓదార్పు యాత్రలు చేస్తుంటారు. ఒక్కోసారి ఆయన రెండు రోజులు దీక్షలు చేస్తుంటారు. మరొకసారి కొన్ని గంటలు మాత్రమే చేస్తుంటారు. వాటికోసం వైకాపా చేతిలో ఉన్న మీడియా ద్వారా చాలా ప్రచారం చేసుకొంటారు. దాని కోసం అట్టహాసంగా ఏర్పాట్లు, భారీగా జనసమీకరణ చేస్తుంటారు. కానీ ఏ అంశం మీద నిలకడగా కొన్ని రోజుల పాటు పోరాడకపోవడమే జగన్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చును. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26వ తేదీ నుండి జగన్ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అది ఎన్నిరోజుల్లో ఏవిధంగా ముగియబోతుందో ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి కూడా చెప్పగలడు. కానీ షరా మామూలుగానే జగన్ దీక్ష కోసం అన్ని జిల్లాలలో పార్టీ నేతలు ఇప్పటి నుండే సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న వై.యం.సి.ఎ. కార్యాలయంలో జిల్లా వైకాపా నేతలు ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు ఇవ్వాళ్ళ సమావేశమవుతున్నారు. జగన్ చేస్తున్న ఈ హడావుడిని చూసిన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజి “జగన్ చేస్తున్న దీక్షలు ఏదో ఫ్యాషన్ షోలాగ సాగుతున్నాయి. ఆయనకి ఎంతసేపు ముఖ్యమంత్రి పదవి మీదే ఆరాటం. ప్రభుత్వం తీసుకొన్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇస్తూ తనే ఆపరేషనల్ సీ.ఎం.అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన రైతులను మభ్య పెడుతున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో మళ్ళీ బ్రతికి బట్ట కట్టడానికి ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. అటువంటి ప్రయత్నాలను మేము ఎదుర్కొంటాము,” అని తెలిపారు.
http://www.teluguone.com/news/content/jagan-mohan-reddy-45-50002.html





