తుపాకుల మ్రోతలో శాంతి చర్చలా?
Publish Date:Sep 11, 2015
Advertisement
భారత్-పాక్ దేశాల సరిహద్దు భద్రతా దళాల అధికారుల మధ్య గురువారం నుండి మూడు రోజుల పాటు డిల్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. సరిహద్దులో కాల్పులు విరమించి శాంతి నెలకొల్పడమే వారి సమావేశం యొక్క ప్రదానోదేశ్యం. కానీ వారు సమావేశం జరుపుతున్న సమయంలోనే సరిహద్దులో పాక్ దళాలు భారత దళాలపై కాల్పులు జరపడం విశేషం. పాక్ మాటలకు చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదని అప్పుడే నిరూపిస్తున్నట్లుంది. కానీ మొదటిరోజు సమావేశం చాలా సానుకూలంగా ముగిసినందుకు భారత్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసారు. రెండవరోజు సమావేశం జరుగుతున్న సమయంలో కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాక్ ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. పాక్ రేంజర్ల డి.జి. మేజర్ ఉమర్ ఫరూకి బుర్కీ నేతృత్వంలో వచ్చిన పాక్ రేంజర్లను ఉద్దేశ్యించి భారత్ హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ మాట్లాడుతూ, “భారత్ ఎప్పుడూ శాంతిని, పొరుగుదేశాలతో స్నేహాన్నే కోరుకొంటుంది. మావైపు నుండి మొదటి బులెట్ ఎన్నడూ పేల్చమని నేను భారత్ తరపున హామీ ఇస్తున్నాను. మీ నుండి కూడా అదే ఆశిస్తున్నాను. ఇరు దేశాలు ఉగ్రవాదుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. కనుక ఇరు దేశాలు కలిసి ఉగ్రవాదులను అరికట్టాల్సి ఉంది. ముఖ్యంగా సరిహద్దులలో ఉగ్రవాదుల చొరబాట్లను నివారించవలసి ఉంది,” అని అన్నారు. హోంమంత్రిగా ఒక భాద్యతాయుతమయిన పదవిలో ఉన్న రాజ్ నాద్ సింగ్ ఆవిధంగానే మాట్లాడాలి గాబట్టి మాట్లాడుతున్నారనుకోవాలి. కానీ, ఇక్కడ శాంతి ప్రవచనాలు చెప్పుకొంటున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల చేతిలో ఇద్దరు భారత జవాన్లు మరణించారు. కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పుడు కూడా సరిహద్దులో తుఫాకులు మ్రోతలు మారు మ్రోగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఇంతగా బరి తెగించి వ్యవహరించడం చాలా విస్మయం కలిగిస్తుంది. అటువంటి దేశాన్ని కాల్పులు విరమించమని, ఉగ్రవాదులను మన దేశంలో చొరబడకుండా అడ్డుకోమని హోంమంత్రి కోరడం వలన ఏమి ప్రయోజనం. “మా వైపు నుండి మొదటి బులెట్ పేల్చమని నేను భారత్ తరపున హామీ ఇస్తున్నాను. మీ నుండి కూడా అదే ఆశిస్తున్నాను,” అని రాజ్ నాద్ సింగ్ చెప్పినప్పుడు పాక్ రేంజర్ల డి.జి. మేజర్ ఉమర్ ఫరూకి బుర్కీ కూడా అటువంటి హామీ ఇస్తే వారి చిత్తశుద్ధిపై కొంతయినా నమ్మకం ఏర్పడి ఉండేది. కానీ ఆయన “నేను కేవలం ఒక డి.జి. స్థాయి అధికారిని మాత్రమే. మీలాగ నిర్ణయం ప్రకటించగల అధికారం నాకు లేదు. కానీ మీ సందేశాన్ని మా ప్రభుత్వానికి తెలియజేస్తాను,” అని గడుసుగా జవాబిచ్చారు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమనుకొన్నట్లయితే సరిహద్దుల్లో కాల్పులు జరుపమని పాక్ ప్రభుత్వమే నేరుగా తన సైనికులకి ఆదేశాలిస్తోందని భావించవలసి ఉంటుంది. కానీ కాల్పుల విరమణ కోసం భారత అధికారులతో చర్చలు జరిపేందుకు వచ్చిన ఒక డి.జి స్థాయి ఉన్నతాధికారి తమ వైపునుండి కాల్పులు జరగవని హామీ ఇవ్వడం లేనప్పుడు ఇక ఈ చర్చలకు అర్ధం ఏముంటుంది?
http://www.teluguone.com/news/content/india-45-49981.html





