టీకాంగ్రెస్ నేతలకు జ్ఞానోదయం అయినట్లేనా?
Publish Date:Sep 12, 2015
Advertisement
రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ మారింది...పాత చింతకాయ పచ్చడిలాగా రుచీపచీ లేకుండా విమర్శలు చేస్తే, జనం పట్టించుకోవడం మానేశారు. జనానికి పంచ్ డైలాగ్ లు కావాలి, అది నిజమైనా, కాకపోయినా సెన్షేషన్ కామెంట్స్ చేయాలి, పచ్చి బూతులు మాట్లాడాలి, సన్నాసులు, వెధవలు, దద్దమ్మలు అంటూ ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడాలి, సందర్భం చూసుకుని జనాల్లో అలజడి రేపాలి, అన్యాయం జరిగిపోతుందంటూ రెచ్చగొట్టాలి... అప్పుడే జనం అటెన్షన్, మీడియా ఫోకస్ ఆ పార్టీపైనా, ఆ లీడర్ పైనా పడుతుంది... ఆటోమెటిగ్గా స్టార్ పొలిటీషియన్ గా మారిపోతాడు. ఇదీ ఇప్పటి ట్రెండ్... దీనికి భిన్నంగా ఏం చేసినా...జనాలు పట్టించుకోరు సరికదా, మొత్తానికే మర్చిపోయే అవకాశముంది. దీన్ని ఆలస్యంగానైనా గుర్తించినట్లున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను గుర్తుతెచ్చుకున్నారో లేక టీటీడీపీ బుల్లెట్ రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకున్నారో తెలియదు గానీ, కొద్దిరోజులుగా దూకుడు మంత్రం ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలకు ధీటుగా మాటల తూటాలు పేల్చుతూ, గులాబీ కోటలో గుబులు పుట్టిస్తున్నారు. దాంతో జనం అటెన్షన్, మీడియా ఫోకస్...టీకాంగ్రెస్ పై పడింది. కేసీఆర్ కు సొంత కొడుకుపైనే నమ్మకం లేదంటూ పొన్నం చేసిన కామెంట్స్ తో వేడెక్కిన వాతావరణం, మెల్లమెల్లగా రాజుకుంటోంది. పొన్నం స్ఫూర్తితో మిగతా టీకాంగ్ నేతలు కూడా కేసీఆర్ పైనా, మంత్రులపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండటంతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడింది. మరోవైపు టీకాంగ్రెస్ నేతల దూకుడు...ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది, తమ నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యిందని, ఇదే దూకుడుని కొనసాగిస్తే, కాంగ్రెస్ కు మళ్లీ పునర్ వైభవం ఖాయమని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అయితే అసెంబ్లీలోనూ సమర్ధవంతంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అప్పుడే ప్రజల అటెన్షన్ కాంగ్రెస్ పై పడుతుందని సీనియర్లు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/t-congress-45-50021.html





